Passport:హైదరాబాద్‌లో రెండు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ప్రారంభం

హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు (Passport) కార్యాలయాల సేవలను మరింత మెరుగుపరిచే దిశగా, నగరంలోని రెండు ప్రాంతాల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) , దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridhar Babu) ప్రారంభించారు. రవాణా సౌకర్యాలకు కేంద్రంగా ఉన్న ఎంజీబీఎస్ (MGBS) మెట్రో స్టేషన్‌లో కొత్త కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అంతకుముందు అమీర్‌పేట్ ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయాన్ని ఎంజీబీఎస్‌కు తరలించి ఆధునికీకరించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ పాసుపోర్టుల జారీలో హైదరాబాద్ కార్యాలయం దేశంలో ఐదవ స్థానం లో ఉందని, ఈ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, ఎం.అనిల్‌కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ పాల్గొన్నారు.
మరోవైపు, టోలిచౌకీ నుంచి రాయదుర్గానికి (Rayadurg) మార్చిన పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. హైదరాబాద్‌లో మరో పాస్ట్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు మహేందర్‌రెడ్డి, అరెకపూడి గాంధీ పాల్గొన్నారు.