Telangana Thalli : తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం.. ఎవరి వాదనేంటి..?

రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సచివాలయం (Secretariate) ఎదుట ఆవిష్కరించబోతోంది. 9వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే విగ్రహావిష్కరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆవిష్కరణ ముహూర్తం దగ్గర పడుతున్న సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విగ్రహ నమూనా అద్భుతంగా ఉందని కాంగ్రెస్ (Congress) శ్రేణులు చెప్తున్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా ఉందని బీఆర్ఎస్ (BRS) విమర్శిస్తోంది.
ఈ ఏడాది ఆగస్టులో సచివాలయం ఎదుట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది అనేక వివాదాలకు దారి తీసింది. తాము అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని (Telangana Thalli Statue) ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సచివాలయం ఎదుట కాదని.. సచివాలయం లోపల అని రేవంత్ రెడ్డి ప్రకటించి ఆగస్టు 7న శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి విగ్రహ ప్రతిష్టాపనకు అవసరమైన పనులు జురగుతున్నాయి. దీనికోసం దాదాపు ఐదున్నర కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. విగ్రహం చుట్టూ లేజర్ లైట్లు, ఫౌంటెయిన్, గార్డెన్ ఏర్పాటు చేస్తోంది.
తెలంగాణ తల్లి విగ్రహంలో గతంలో రాచరిక పోకడలు ఉండవని.. తాము ఏర్పాటు చేయబోయే విగ్రహంలో అలాంటివి ఉండబోవని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సగటు తెలంగాణ మహిళకు ప్రతిబింబంలా, అస్తిత్వానికి చిహ్నంలా ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే విగ్రహం చాలా సింపుల్ గా ఉంది. ఆకుపచ్చ చీర, ఎర్ర జాకెట్ తో చేతిలో మక్క కంకులు, వరికంకులు పట్టుకుని ఉంది. కాళ్లకు పట్టీలు, మెట్టెలు, నుదుటన బొట్టుతో ఒక చేత్తో ఆశీర్వదిస్తున్నట్టు తీర్చిదిద్దారు. విగ్రహం అడుగుభాగాన పోరుబాటకు చిహ్నంగా పిడికిలి బిగించిన చేతులతో దిమ్మెను ఏర్పాటు చేశారు. తెలంగాణ మహిళలందరూ తమను తెలంగాణ తల్లిలో చూసుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దినట్లు శిల్పి రమణా రెడ్డి వెల్లడించారు.
అయితే ఈ విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇది తెలంగాణ తల్లి విగ్రహమా.. లేకుంటే కాంగ్రెస్ తల్లిదా అని వంగ్యాస్త్రాలు విసురుతోంది. తాము అధికారంలోకి వస్తే ఈ విగ్రహాన్ని తొలగిస్తామని స్పష్టం చేసింది. గతంలో బీఆర్ఎస్ విడుదల చేసిన తెలంగాణ తల్లికి కిరీటం ఉండేది. చేతిలో బతుకమ్మ ఉండేది. ఇందులో రాచరిక పోకడలున్నాయని గతంలోనే కాంగ్రెస విమర్శించింది. తాము అధికారంలోకి వస్తే మారుస్తామని ప్రకటించింది. అన్నట్టుగానే ఇప్పుడు విగ్రహాన్ని సామాన్య మహిళను పోలేలా తీర్చిదిద్ది ఆవిష్కరించబోతోంది. మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అధికార, ప్రతిపక్షాల మధ్య మరోసారి అగ్గిరాజేస్తోంది.