Sridhar Babu: తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ (Global Innovation Hub) గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా (Australia) పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్‌లోని ప్రముఖ యూనివర్సిటీ ఆర్‌ఎంఐటీ (RMIT) తో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ)ను కుదుర్చుకుందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెడీ టూ వర్క్ ఫోర్స్ తయారీ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. రేపటి జీనోమ్ వ్యాలీకి ఇది ఒక బ్లూ ప్రింట్‌గా మార్గనిర్దేశం చేస్తుందన్నారు.
ఆసియాలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 80 బిలియన్ డాలర్ల విలువ చేేస 2వేలకు పైగా జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ ఫార్మా, బయోటెక్ కంపెనీలు ఇక్కడ ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. దేశంలో ఉత్పత్తయ్యే ఔషధాల్లో మన వాటా 40 శాతంగా ఉందన్నారు. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్లలో మూడింట ఒక వంతును మనమే అందిస్తున్నామన్నారు. త్వరలోనే ప్రత్యేకంగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ స్కూల్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీధర్ బాబు సమక్షంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్, ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కేథరీన్ ఇట్సియోపౌలోస్ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు.