తెలంగాణలో కొత్త వ్యవస్థ ‘హైడ్రా..’

ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అనే నూతన స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం దీని నిర్మాణం, బాధ్యతలు, విధివిధానాలతో జీవో 99 విడుదల చేసింది. అందులోని వివరాల మేరకు.. జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2 వేల చ.కి.మీ. విస్తీర్ణంలో హైడ్రా విధులు నిర్వర్తిస్తుంది. హైడ్రాకు అఖిల భారత సర్వీసుకు చెందిన కార్యదర్శి లేదా అంతకు మించి హోదా కలిగిన అధికారి కమిషనర్‌గా ఉంటారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంకులోని ఐపీఎస్ అధికారి ఎ.వి.రంగనాథ్‌ను జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా నియమించారు. ఇప్పుడు ఈ పోస్టును కూడా హైడ్రాకు కేటాయించి, ఆ వేదిక పరిధిని ఓఆర్‌ఆర్ వరకు విస్తరించింది. జీహెచ్‌ఎంసీకి చెందిన విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు బల్దియాలో గతంలో మాదిరే కొనసాగనున్నాయి.
హైడ్రా విధులు ఏంటి?
జీహెచ్‌ఎంసీతోపాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రాంతాలకు విపత్తుల నుంచి రక్షణ కల్పనకు హైడ్రా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. ఇతర రాష్ట్రాలు, జాతీయస్థాయి విపత్తు స్పందన బృందాలు, వాతావరణశాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ, వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టాలి. విపత్తు స్పందన బృందాలు ఏర్పాటు చేసుకోవాలి. జీహెచ్‌ఎంసీ లేదా స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఅవుట్ల ఖాళీ స్థలాలు, పరిశ్రమలశాఖ స్థలాలు, జలవనరుల ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించాలి. వాటిపై విచారణ చేపట్టి ఆక్రమణలను అడ్డుకోవాలి. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, పోలీసు కమిషనర్లు ఇతరత్రా శాఖలు హైడ్రాకు అవసరమైన సహకారం అందించాలి. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘన, శిథిల భవనాలు, పౌరుల భద్రతకు సంబంధించిన పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్తులను పరిశీలించే అధికారం ఈ సంస్థకు ఉంటుంది. అక్రమ నిర్మాణాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు.
పోలీసు, జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జలమండలి, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, మూసీనది అభివృద్ధి సంస్థ, విపత్తుశాఖ, అడవులు, పట్టణ జీవ వైవిధ్యం, నీటిపారుదల తదితర శాఖలు హైడ్రా కమిషనర్ సమన్వయంతో పనిచేయాలి.ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో వాహన రద్దీని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. రోడ్లపై గుంతలు, ముప్పు పొంచి ఉన్న మార్గాలు, వరద ముంపునకు గురైన కాలనీలపై కలెక్టర్లు, స్థానిక సంస్థల అధికారులు, పోలీసులు ఇతర శాఖల సమన్వయంతో తగు చర్యలు చేపట్టాలి.
రెండు కమిటీలు..
హైడ్రాకు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, పురపాలక, రెవెన్యూ శాఖల మంత్రులు, రాజధానిలోని జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, జీహెచ్‌ఎంసీ మేయర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రెవెన్యూ, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శులు, సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం అధిపతి సభ్యులుగా ప్రధానమైన పాలకమండలి ఉంటుంది. విధానపరమైన నిర్ణయాలపై ఈ కమిటీ మార్గదర్శనం, సమీక్షలు చేస్తుంది.