Hyderabad: రేపటి నుంచి భూ భారతి పోర్టల్.. 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు

రాష్ట్రంలో భూభారతి పోర్టల్ (Bhu Bharati portal) ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సేవలను విస్తరించనున్నారు. పోర్టల్‌ను ఈనెల 14న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించనున్నారు. శనివారం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు సీఎం… ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపైనా ఆయన సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్‌ను రూపొందించామని సీఎం తెలిపారు.
భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలో మూడు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి.. కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు పోర్టల్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
వెబ్‌సైట్‌తోపాటు యాప్‌ను పటిష్ఠంగా నిర్వహించాలన్నారు. అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని, ఇందిరమ్మ కమిటీలు రూపొందించిన జాబితాను మండల అధికారులతో కూడిన బృందం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి(Revanth reddy) ఆదేశించారు. ఇందిరమ్మ(Indiramma) ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. అనర్హులు ఎవరైనా ఇల్లు పొంది నిర్మించుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతోపాటు వారు పొందిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు మంజూరైన ఇంటికి వారి సౌలభ్యం ఆధారంగా విలువలో అదనంగా 50% మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సూచించారు. లబ్ధిదారులకు ఆర్థికపరమైన ఊరట కల్పించేందుకు సిమెంటు, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని సీఎం తెలిపారు.