Operation Kagar: ఆపరేషన్ కగార్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యంతరాలేంటి..?

ఛత్తీస్‌గఢ్‌లో (Chattisgarh) కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సలైట్ (naxalite) వ్యతిరేక ఆపరేషన్ ‘ఆపరేషన్ కగార్’ను (Operation Kagar) తక్షణం నిలిపివేయాలని తెలంగాణలోని (Telangana) ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఆపరేషన్‌ను గిరిజనులు, యువతపై జరుగుతున్న హింసాత్మక దాడిగా వారు ఆరోపిస్తున్నారు. శాంతి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
‘ఆపరేషన్ కగార్’ ప్రధాన లక్ష్యం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ (bastar) ప్రాంతం సహా మావోయిస్ట్ (maoist) కార్యకలాపాలను అణచివేయడం.., మావోయిస్టుల ప్రభావాన్ని తొలగించడం. ఇది నాలుగు దశల్లో సాగుతోంది. మొదటగా బస్తర్‌లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లు (FOB) ఏర్పాటు చేయడం, డ్రోన్‌లు, శాటిలైట్ ఇమేజింగ్ నిఘా ద్వారా మావోయిస్టుల సమాచారాన్ని సేకరించడం, మావోయిస్ట్ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో 612 సాయుధ పోలీస్ స్టేషన్ల నిర్మాణం, చివరగా మావోయిస్టులను లొంగిపోవాలని కోరడం. ఇవీ ఆపరేషన్ కగార్ ప్రధాన ఉద్దేశాలు. ఇందులో భాగంగా సుమారు 7,500 మంది నక్సలైట్లు లొంగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కగార్ ఆపరేషన్‌ను మావోయిస్టులు తమ విప్లవాత్మక ఉద్యమంపై దాడిగా పేర్కొంటున్నారు. సీపీఐ (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీ ఈ ఆపరేషన్‌ను “గిరిజన జనసంహారం”గా అభివర్ణించింది. దీనిని నిలిపివేస్తే శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు (KCR) హనుమకొండలో జరిగిన బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభలో ఆపరేషన్ కగార్‌ను తీవ్రంగా ఖండించారు. “కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో యువతను, గిరిజనులను ఊచకోత కోస్తోంది. ఇది ప్రజాస్వామ్యం కాదు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. కేంద్రం వెంటనే ఈ ఆపరేషన్‌ను నిలిపివేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి కూడా ఈ ఆపరేషన్‌ను “అమానవీయం”గా అభివర్ణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె. జానారెడ్డితో చర్చించారు. పీస్ కమిటీ సిఫారసులను పార్టీ అధిష్టానానికి పంపి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీలతో పాటు పౌర హక్కుల సంఘం నేతలు కూడా ఈ ఆపరేషన్‌ను వ్యతిరేకిస్తున్నారు.
ఈ ఆపరేషన్‌ను కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ ఈ డిమాండ్‌ను తీవ్రంగా విమర్శించింది. “నక్సలిజాన్ని నాశనం చేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్‌ను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వీరు అధికారంలో ఉన్నప్పుడు నక్సలైట్లను ఎదిరించలేదా?” అని బీజేపీ ప్రశ్నించింది. మరోవైపు, కొందరు విశ్లేషకులు ఈ ఆపరేషన్ గిరిజన భూముల్లో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు జరుగుతున్న కుట్రగా చూస్తున్నారు. బస్తర్ ప్రాంతంలోని ఖనిజ నిల్వలపై కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. అందుకే ఈ ఆపరేషన్ జరుగుతోందని వారు అంటున్నారు. అయితే మావోయిస్టులను పూర్తిగా అంతం చేసే వరకూ ఆపరేషన్ కగార్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.