Revanth Cabinet: రేవంత్ సోషల్ ఇంజినీరింగ్.. కేబినెట్‌లోకి కొత్తగా ముగ్గురు..! రెడ్లకు నిరాశే..!!

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు పూర్తయింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కొత్తగా ముగ్గురిని కేబినెట్ లోకి తీసుకున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Lakshman Kumar), గడ్డం వివేక్ (Gaddam Vivek), వాకిటి శ్రీహరిలకు (Vakiti Srihari) కొత్తగా కేబినెట్ లో స్థానం దక్కింది. అయితే మంత్రివర్గంలో చోటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. బీసీ, ఎస్సీ వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించి మరో మూడు ఖాళీలను అలాగే ఉంచింది. దీంతో అసంతృప్తులకు అవకాశం ఉందనే సంకేతాలు పంపించింది. మంత్రివర్గంలో స్థానం ఆశించిన రెడ్డి సామాజిక వర్గ నేతలకు నిరాశే ఎదురైంది. మొత్తంగా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో సోషల్ ఇంజినీరింగ్ కు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ముగ్గురికి అవకాశం కల్పించారు. బీసీ, ఎస్సీ (మాల, మాదిగ) వర్గాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి ఈసారి అవకాశం దక్కలేదు. ఇప్పటికే కేబినెట్‌లో నలుగురు రెడ్డి మంత్రులు ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం, రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఏడుగురు బీసీ, 15 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఈ విభాగాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకున్నారు. కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులలో ఒకరు బీసీ (ముదిరాజ్) వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, మిగిలిన ఇద్దరు ఎస్సీ (మాల, మాదిగ) వర్గాల నుంచి ఎంపికయ్యారు.
వాకిటి శ్రీహరి చేరికతో మంత్రివర్గంలో బీసీ మంత్రుల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరింది. ఇప్పటికే ఇద్దరు బీసీ మంత్రులు కేబినెట్‌లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏడుగురు బీసీ ఎమ్మెల్యేలలో ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం గమనార్హం. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి ఎంపిక బీసీ వర్గాల్లో సంతృప్తి కలిగిస్తుందని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనే డిమాండ్‌పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంలో చర్చనీయాంశంగా మారాయి. అయితే, చట్ట సవరణ అవసరమని, ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదని రేవంత్ స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గాల నుంచి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (మాల), దామోదర రాజనర్సింహ (మాదిగ) కేబినెట్‌లో ఉన్నారు. కొత్తగా వివేక్ (మాల), అడ్లూరి లక్ష్మణ్ (మాదిగ) చేరికతో ఎస్సీ మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 15 మంది ఎస్సీ ఎమ్మెల్యేలకు ఈ నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాల, మాదిగ సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సీఎం రేవంత్ ఎస్సీ వర్గాల్లో ఐక్యతను చాటే ప్రయత్నం చేశారు.
అయితే, మంత్రివర్గంలో ఎస్టీ లంబాడీ సామాజిక వర్గానికి చోటు దక్కలేదు. కాంగ్రెస్ నుంచి 9 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ, ప్రస్తుతం ఎస్టీ ఆదివాసీ వర్గానికి చెందిన సీతక్క మాత్రమే మంత్రిగా ఉన్నారు. లంబాడీ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరచడానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం ఎస్టీ వర్గాల్లో కొంత అసంతృప్తి కలిగించే ఛాన్స్ ఉంది. లంబాడీలు తెలంగాణలో గణనీయంగా ఉండడమే కారణం.
మంత్రివర్గంలో ఇప్పటికే నలుగురు రెడ్డి మంత్రులు ఉండటంతో, ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో రాజకీయంగా బలమైన సముదాయంగా ఉంది. సీఎం రేవంత్ ఇతర వెనుకబడిన, దళిత వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సామాజిక సమతుల్యతను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ ఎజెండాకు అనుగుణంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.