Cabinet Expansion: రేపే తెలంగాణ కేబినెట్ విస్తరణ..? కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడి సుమారు 18 నెలలు గడుస్తున్న నేపథ్యంలో, మంత్రివర్గ విస్తరణపై (Cabinet Expansion) ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విస్తరణ కోసం చాలాకాలంగా రాష్ట్ర నేతలు గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు.. ఆశావహులు గట్టిగా లాబీయింగ్ చేసుకుంటున్నారు. అయితే సామాజిక-ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా కొందరికి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో గరిష్టంగా 18 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా 12 మంది మంత్రులు ఉన్నారు. డిసెంబర్ 7, 2023న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత అనుభవజ్ఞులైన ఈ మంత్రులలో ఎనిమిది మంది గతంలో వివిధ ప్రభుత్వాల్లో కీలక శాఖలను నిర్వహించారు. ఆరు మంత్రి పదవులు ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చాలాకాలంగా నేతల్లో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే విస్తరణ జరుగుతుందని భావించినప్పటికీ అధిష్టానం ఓకే చెప్పలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలతో అధిష్టానం బిజీగా ఉండటం ఇందుకు కారణం అని సమాచారం. అయితే ఇప్పుడు నాలుగైదు మంత్రి పదవులను భర్తీ చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
కేబినెట్ లో స్థానం కోసం పోటీ పడే వారి సంఖ్య భారీగా ఉంది. దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత జాబితాను సిద్ధం చేసినప్పటికీ, అధిష్టానం సామాజిక సమతుల్యతను పరిగణనలోకి తీసుకుంటోంది. బోధ్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్ వెంకటస్వామి, మహబూబ్‌నగర్‌కు చెందిన వాకిటి శ్రీహరి (ముదిరాజ్), ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు (వెలమ), నల్గొండకు చెందిన బాలు నాయక్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులు కేబినెట్ లో చోటు ఆశిస్తున్నారు.
ప్రస్తుత కేబినెట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఒక్క మంత్రి కూడా లేరు. ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ నుంచి పి. సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్‌సాగర్ రావు లాంటి నాయకులు తప్పకుండా తమకు బెర్త్ లభిస్తుందని ఆశిస్తున్నారు. అదే విధంగా, రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ అధిష్టానం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత కేబినెట్‌లో ముస్లిం ప్రాతినిధ్యం లేకపోవడం, ముదిరాజ్, మున్నూరు కాపు, లంబాడ వంటి సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాకిటి శ్రీహరి (ముదిరాజ్), ఆది శ్రీనివాస్ (మున్నూరు కాపు), అమీర్ అలీ ఖాన్ (మైనారిటీ) వంటి నాయకులకు అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. అలాగే ఎస్సీ నుంచి మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం లభించవచ్చు. మొత్తానికి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలియగానే నేతల్లో జోష్ కనిపిస్తోంది. అయితే ఎవరెవరికి బెర్త్ లభిస్తుందనేది అధికారికంగా ప్రకటిస్తే తప్ప అంచనాకు రావడం కష్టంగా ఉంది.