టీడిఎఫ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
కోవిడ్ 19 సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్న కమ్యూనిటీని ఆదుకునేందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడిఎఫ్) ముందుకు వచ్చింది. అటు అమెరికాలోనూ, ఇటు తెలంగాణలోనూ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కోవిడ్ 19 సంక్షోభం, లాక్డౌన్ కారణంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో టీడిఎఫ్ యుఎస్ఎ అధ్యక్షురాలు కవితా చల్లా అమెరికాలోని దాతలతో సంప్రదించి, ఇండియాలోని టీడిఎఫ్ నాయకులతో మాట్లాడి సహాయ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మే 23వ తేదీన శనివారంనాడు టీడిఎఫ్ ఇండియా ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వివిధ చోట్ల దాదాపు 200 మంది బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న డా. వేణుగోపాలచారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమెరికాలో ఉంటున్న కవితా చల్లా, ఆమె స్నేహితులు, దాతలు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అభినందిస్తున్నట్లు చెప్పారు. బ్రాహ్మణులకు రేషన్ కార్డులు కూడా లేవని, ఆలయాల మూసివేత, లాక్డౌన్ వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో వారిని ఆదుకునేందుకు టీడిఎఫ్ ముందుకు రావడం సంతోషకరమైన విషయమన్నారు.
టీడిఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ వట్టె రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను చేయడంతోపాటు విజయవంతం కావడానికి శ్రమించారు. తాడ్బండ్లోని హనుమాన్ టెంపుల్ వద్ద ఉన్న డా. వేణుగోపాలచారి గృహంలో, అల్వాల్‌లోని సూర్యనగర్‌లో ఉన్న సాయిబాబా టెంపుల్లో, ఆనంద్‌బాగ్ వద్ద ఉన్న శంకర్‌మఠంలో, కెపిహెచ్బి ఫేజ్ 4లో బ్రాహ్మణులకు నిత్యావసర వస్తువులను అందజేశారు.
అమెరికాకుచెందిన దాతలు జయంత్, కవితాచల్లా కుటుంబం, డా. వెంకటేశ్వరరావు-స్మిత కుటుంబం, రవి కిరణ్-పద్మ నంగునూరి కుటుంబం, లక్ష్మీనరసింహరావు -కిరణ్మయి చేపూరి కుటుంబం, డా. వెంకటేశ్వర్ – సునీత అద్దంకి కుటుంబం, రామచంద్రారెడ్డి -అనిల కుటుంబం, నరేందర్‌రావు-షీలారెడ్డి కుటుంబం, మోహన్-లత దేవినేని కుటుంబం సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, వారందరికీ టీడిఎఫ్యుఎస్ఎ, టీడిఎఫ్ ఇండియా టీమ్ తరపున ధన్యవాదాలను నిర్వాహకులు తెలియజేశారు.
టీడిఎఫ్ ప్రెసిడెంట్ కవితా చల్లా కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన డా. వేణుగోపాలచారికి ధన్యవాదాలు తెలుపుతూ, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన టీడిఎఫ్ ఇండియా నాయకులు వట్టె రాజారెడ్డి, మట్ట రాజేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
టీడిఎఫ్కు సంబంధించిన ఇతర వివరాకోసం వెబ్‌సైట్‌ను చూడండి.
For more information please visit www.telangana.org






