National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసు.. రేవంత్ రెడ్డికి సంబంధమేంటి..?

నేషనల్ హెరాల్డ్ (National Herald Case) మనీలాండరింగ్ కేసు భారత రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా చర్చనీయాంశంగా ఉంది. ఈ కేసులో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఛార్జిషీట్‌లో చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేగింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (BRS) తీవ్రంగా స్పందించింది. రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
నేషనల్ హెరాల్డ్ అనేది 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన వార్తాపత్రిక. దీనిని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ప్రచురించేది. స్వాతంత్ర్య సమరయోధులు ఈ సంస్థలో షేర్‌హోల్డర్లుగా ఉండేవారు. అయితే కాలక్రమేణా ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి 2008లో మూతపడింది. అప్పటికి ఏజేఎల్‌పై రూ. 90.25 కోట్ల అప్పు ఉంది. ఈ అప్పులను తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ రుణ రహితంగా రూ. 90.25 కోట్లు అందించింది. ఆ తర్వాత 2010లో యంగ్ ఇండియా (Young India) అనే కంపెనీ ఏర్పాటైంది. దీనికి దాదాపు రూ. 2000 కోట్ల విలువైన AJL ఆస్తులు బదిలీ అయ్యాయి. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని ఈడీ దర్యాప్తులో తేలింది.
తాజాగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించింది. 2019 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడిగా ఉంటూ, యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు సేకరించేందుకు కాంగ్రెస్ నాయకులను ఒత్తిడి చేసినట్లు ఈడీ ఆరోపించింది. విరాళాలు ఇస్తే టికెట్లు, పదవులు ఇప్పిస్తామని రేవంత్ ప్రలోభపెట్టినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది.. ఈ వ్యవహారంలో రేవంత్‌తో పాటు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు, దివంగత నేత అహ్మద్ పటేల్, పవన్ కుమార్ బన్సల్ వంటి నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. అరవింద్ అనే కాంగ్రెస్ నాయకుడు ఈడీ విచారణలో అహ్మద్ పటేల్ సూచనల మేరకు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చినట్లు అంగీకరించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు తెరపైకి రావడంతో బీఆర్ఎస్ పార్టీ (BRS) తీవ్రంగా స్పందించింది. ఈడీ ఛార్జిషీట్‌తో రేవంత్ రెడ్డి అవినీతి బయటపడిందని, అధికారం కోసం ఆయన ప్రలోభాలకు పాల్పడినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చిందని, ఈ కేసులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. అయితే కేటీఆర్ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. సిస్టర్ స్ట్రోక్ నుంచి డైవర్ట్ చేసేందుకే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నారని విమర్శించింది.
నేషనల్ హెరాల్డ్ కేసు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ఈ కేసులోకి రావడంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు కూడా రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఈ విషయాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్తుందనేది కీలకం. ఈడీ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ కేసు భవిష్యత్తులో మరింత సంచలన రాజకీయ పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.