Koushik Reddy: కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేయలేరా కేసీఆర్ గారూ…!?

హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (Huzurabad MLA Koushik Reddy) తీరు చర్చనీయాంశంగా మారింది. ఆయన దుందుడుకు వ్యవహారం బీఆర్ఎస్ (BRS) పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఆచితూచి వ్యవహరించాలి. గెలిపించిన ప్రజలకు మంచిపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. అంతేకానీ చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలకు వెళ్లి సవాళ్లు విసురుకోవడం, మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం లాంటివి చేయకూడదు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం హోదాకు తగ్గట్లు వ్యవహరించట్లేదు. చిన్న పిల్లాడిలా గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నరు. అందుకే పలుమార్లు అరెస్ట్ అవుతున్నారు. ఒక ఎమ్మెల్యే వ్యవహరించాల్సినట్లు ఆయన ప్రవర్తన ఉండట్లేదని సొంత నియోజకవర్గ ప్రజలే అభిప్రాయపడుతున్నారు.
కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో (Karimnagar DRC Meeting) ఎమ్మెల్యే సంజయ్ (MLA Sanjay) ని దూషించారు కౌశిక్ రెడ్డి. దీంతో ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన నేరుగా స్పీకర్ (Assembly Speaker) కు కూడా కంప్లెయింట్ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆయనపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్టు (Koushik Reddy Arrest) చేసి కరీంనగర్ కు తరలించారు. అక్కడ జడ్జి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. కానీ ప్రతి చిన్న విషయానికీ కౌశిక్ రెడ్డి స్పందించే తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఆయన దుందుడుకు వ్యవహారాల వల్ల పాపులర్ అవుతానని భావిస్తున్నట్టున్నారు.
కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక వివాదం రేగుతోంది. అసెంబ్లీలో కూడా కౌశిక్ రెడ్డి దూకుడుగా వ్యవహరించేవారు. దీంతో స్పీకర్ ఆయన్ను పలుమార్లు హెచ్చరించారు. ఇలాగే వ్యవహరిస్తే సభ (Assembly) నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని కూడా చెప్పారు. కవిత అరెస్టు సమయంలోనూ, కేటీఆర్ కు నోటీసుల వ్యవహారంలోనూ కౌశిక్ రెడ్డి దూకుడు ప్రదర్శించారు. అంతేకాదు.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి (Congress Party) వెళ్లిన ఎమ్మెల్యేలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీంతో అరికెపూడి గాంధీ (Arikepudi Gandhi) నేరుగా కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి సవాల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) కూడా కౌశికి రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు.
కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తున్నారు. కానీ ఆయనకు కేటీఆర్ (KTR) అండదండలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అందుకే వాళ్లు కూడా కౌశిక్ రెడ్డిపై ఏమీ మాట్లాడలేక పోతున్నారు. కేసీఆర్ (KCR) అయినా జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డిని కంట్రోల్ చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆయన వల్ల పార్టీకి లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయని.. భవిష్యత్తులో ఆయన వల్ల పార్టీకి చెడ్డపేరు రావడం ఖాయమని ఘంటాపథంగా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ మేల్కొంటుందో లేదో చూడాలి.