Revanth Reddy : రేవంత్ రెడ్డి ఏడాదిలో సాధించిన అతి గొప్ప విజయం ఇదే..!

తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చి ఇవాల్టికి సరిగ్గా ఏడాది. గతేడాది ఇదే రోజున ముఖ్యమంత్రిగా (Chief Minister) రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ (Congress) హైకమాండ్ తరలివచ్చింది. తెలంగాణ ఇచ్చినా పదేళ్లపాటు ఆ పార్టీ అధికారానికి దూరంగా ఉండిపోయింది. పదేళ్ల తర్వాత రేవంత్ రెడ్డి (Revanth Reddy) పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఆయనకే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్. అయితే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్లు అస్సలు ఊహించలేదు. సీనియర్ల కుట్రలు, కుతంత్రాల ముందు రేవంత్ రెడ్డి తట్టుకోలేరని.. ఏడాది కూడా కొనసాగలేరని చాలా మంది అనుకున్నారు.
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రేవంత్ రెడ్డి దిగ్విజయంగా ఏడాది పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల పేరిట ఘనంగా సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులంతా ఏడాది పదవీకాలాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత బీఆర్ఎస్ నేల మీదకు దిగొచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అంతకుముందు బీఆర్ఎస్ (BRS) అహంకారంతో పాలించేదని.. రేవంత్ రెడ్డి ఆ అహంకారాన్ని నేలకు దించారని చెప్పుకుంటున్నాయి.
రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై మిశ్రమ స్పందన ఉంది. ఇది ఎక్కడైనే సహజమే. అంతా బాగుందని ఎవరూ చెప్పరు. కొన్ని విజయాలుంటాయ్.. కొన్ని అపజయాలుంటాయి.. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిని ఒక్క విషయంలో అందరూ మెచ్చుకుని తీరాలి. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి వాళ్లెంతోమంది కాంగ్రెస్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఎలా ఇస్తారని బహిరంగంగానే చాలా మందినేతలు ప్రశ్నించారు. కొంతమంది అసలు రేవంత్ రెడ్డి ఉండగా గాంధీ భవన్ గడప తొక్కబోమని ప్రతిన పూనారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి లాంటి నేతలు అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలేదు.
రేవంత్ రెడ్డి అంటే బయటకు చెప్పకపోయినా పార్టీలో ముందు నుంచి ఉన్న సీనియర్లంతా గుర్రుగానే ఉండేవారు. అయితే వాళ్లకు పదేళ్లలో సాధ్యం కానిది రేవంత్ రెడ్డి రెండేళ్లలో చేసి చూపెట్టారు. అందుకే రేవంత్ రెడ్డిపైన పూర్తి విశ్వాసం ఉంచింది హైకమాండ్. ఆయనకే సీఎం పీఠం కట్టబెట్టింది. అప్పటి నుంచి రేవంత్ రెడ్డిపై నేతలంతా విశ్వాసం కనబర్చడం మొదలుపెట్టారు. నాడు విమర్శించిన నేతలే ఇప్పుడు రేవంత్ రెడ్డిని వేనోళ్ల పొగుడుతున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా స్వరం వినిపించే ఒక్కరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనపడట్లేదు. గతంలో వైఎస్, రోశయ్య లాంటి వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని అసంతృప్త స్వరాలుండేవి. కానీ రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పార్టీ నేతలందరినీ రేవంత్ రెడ్డి గ్రిప్ లో పెట్టుకున్నారనే చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు ఉంటారు. కానీ రేవంత్ వచ్చాక ఆ పరిస్థితి కనిపించట్లేదు. కేడర్ అంతా ఏకతాటిపైనే ఉంది. అది కూడా రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తోంది. దటీజ్ రేవంత్ రెడ్డి..!