Jubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్.. నామినేషన్ల స్వీకరణ షురూ!

జూబ్లీహిల్స్ (Jubileehills ) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియోజకవర్గం ఒక్కసారిగా కేంద్ర బిందువుగా మారింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. మూడు ప్రధాన పార్టీల నుంచి దాదాపు అభ్యర్థులు ఖరారు కావడంతో ఇక్కడ త్రిముఖ పోరు అనివార్యమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఉప ఎన్నిక ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా మొదలైంది. ఇవాల్టి నుంచి ఈ నెల 21 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం షేక్‌పేట ఎమ్మార్వో (MRO) కార్యాలయంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నామినేషన్ దాఖలుకు సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక నిబంధన విధించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ, నామినేషన్ల పత్రాలు సమర్పించే సమయంలో అభ్యర్థి భౌతికంగా హాజరుకావడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు.
ఉప ఎన్నిక బరిలో దిగేందుకు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. గెలుపుపై ధీమాతో అన్ని పార్టీలు ప్రచారం, వ్యూహ రచనపై దృష్టి సారించాయి. బీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బరిలోకి దింపింది. కాంగ్రెస్ నుంచి బీసీ నేత నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ ముగ్గురు కీలక నేతల మధ్య పోటీ జరగనుండటంతో.. జూబ్లీహిల్స్‌లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ నమోదైన ఫలితాలు, ఓటర్ల సామాజిక సమీకరణాలు ఈసారి ఎవరికి అనుకూలిస్తాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత కీలకమైంది. ప్రస్తుతం బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు స్థానికంగా మంచి పట్టున్నవారే కావడంతో, పోలింగ్ రోజు వరకు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది. ప్రచారంలో ఏ పార్టీ తమ బలాన్ని ప్రదర్శిస్తుంది, ఏ అభ్యర్థి ఓటర్లను ఎక్కువగా ఆకర్షిస్తారనేది ఫలితాన్ని నిర్ణయించనుంది. మొత్తంమీద, నవంబర్ 11 పోలింగ్ రోజు కోసం, ఆ తర్వాత 14న వెలువడే ఫలితం కోసం రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.