T BJP: మోదీ క్లాస్ లీక్.. తెలంగాణ బీజేపీలో రచ్చ!
ఢిల్లీ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల ఎంపీలతో జరిపిన సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా ప్రధానితో సమావేశం అంటే అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులు లేదా రాజకీయ వ్యూహాలపై చర్చ జరుగుతుందని అంతా భావిస్తారు. కానీ, ఈసారి సీన్ రివర్స్ అయింది. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ప్రధాని మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేయడం, ఎంపీలకు గట్టిగా క్లాస్ పీకడం, ఆ వెంటనే ఆ సంభాషణ మీడియాకు లీక్ కావడం కమల దళంలో కలకలం రేపుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధాని మోదీ తెలంగాణ ఎంపీల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “తెలంగాణలో మనం అధికారంలోకి వస్తామన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. అలాంటి బలమైన స్థితి నుంచి పార్టీని ఎందుకు కిందకు లాగేశారు? అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపును లోక్సభ ఎన్నికల తర్వాత ఎందుకు కొనసాగించలేకపోతున్నారు?” అని ప్రధాని నిలదీసినట్లు తెలుస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టకుండా, కేవలం గాలివాటంగా గెలుస్తామనుకుంటే పొరపాటని హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యంగా బీఆర్ఎస్ బలహీనపడిన వేళ, ఆ స్థానాన్ని ఆక్రమించడంలో బీజేపీ విఫలమైందన్నది ప్రధాని ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది.
అయితే, ప్రధానితో జరిగిన అత్యంత రహస్య, అంతర్గత సమావేశం వివరాలు మీడియాకు పొక్కడం కమలనాథులను షాక్కు గురిచేసింది. సాక్షాత్తు ప్రధాని తమ సొంత ఎంపీలను మందలించిన విషయం బయటకు రావడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే అంశం. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ అంతర్గత విషయాలను, అందులోనూ ప్రధానితో జరిగిన సంభాషణను బయటకు లీక్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి గుట్టు రచ్చకెక్కించిన వారిని గుర్తించే పనిలో అధిష్టానం ఉందని, వారిపై కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ లీక్ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దల దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.
అసలు ఈ లీక్ వెనుక ఉన్నది ఎవరు? అనేది పక్కన పెడితే.. ఈ ఘటన తెలంగాణ బీజేపీలో నెలకొన్న తీవ్రమైన అనైక్యతకు దర్పణం పడుతోంది. పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహారం నడుస్తోందనే విమర్శలకు ఇది బలం చేకూర్చింది. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఒక వర్గంపై మరో వర్గం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. బహుశా, ప్రత్యర్థి వర్గాన్ని ఇబ్బంది పెట్టే క్రమంలోనే సొంత పార్టీ నేతలే ఈ వార్తను లీక్ చేశారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గ్రూపు రాజకీయాల వల్ల క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీజేపీ గ్రాఫ్ పడిపోతోందనడానికి నిదర్శనంగా నిలిచాయి. క్షేత్రస్థాయిలో పార్టీని అభిమానించే వాళ్లు బలంగా ఉన్నప్పటికీ, నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను కానీ, బీఆర్ఎస్ పతనాన్ని కానీ తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీ విఫలమవుతోంది.
తాజా పరిణామాలు గమనిస్తుంటే, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం అటుంచితే, సిట్టింగ్ సీట్లను కాపాడుకోవడం కూడా గగనమే అనిపిస్తోంది. ప్రధాని మోదీ హెచ్చరికలను సీరియస్గా తీసుకొని, లీకుల రాజకీయాలకు స్వస్తి పలికి, సమిష్టిగా పనిచేయకపోతే తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. మరి కిషన్ రెడ్డి వార్నింగ్ పార్టీలో క్రమశిక్షణను తీసుకొస్తుందా? లేక వర్గపోరు మరింత ముదురుతుందా? అనేది వేచి చూడాలి.






