Kavitha Letter: కేసీఆర్‌కు కవిత లేఖ.. బీఆర్ఎస్ లో పెద్ద చర్చ..!!

బీఆర్‌ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) రాసిన ఆరు పేజీల సంచలన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కేసీఆర్ కుటుంబంలో, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. వరంగల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ గురించి పాజిటివ్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను తెలియజేస్తూ, పార్టీ నాయకత్వంపై పలు కీలక అంశాలను ఆమె ఈ లేఖలో ప్రస్తావించారు. కవిత లేఖ కేసీఆర్ కుటుంబంలో, పార్టీలో ఉన్న అసమ్మతిని తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), కవిత మధ్య అధికార పోరు, కుటుంబ విభేదాలపై ఊహాగానాలు సాగుతున్నాయి. కవిత లేఖ ఈ విభేదాలకు బలం చేకూర్చినట్లు కనిపిస్తోంది. వరంగల్‌లో ఏప్రిల్ 27న జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో పార్టీ సీనియర్ నేతలకు అవకాశం ఇవ్వకపోవడంపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “2001 నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు సభలో ప్రసంగిస్తే బాగుండేది. కేసీఆర్ స్టేజ్‌పైకి రాకముందు వారికి అవకాశం ఇవ్వాల్సింది” అని కవిత లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ నిర్వహణలో కేటీఆర్, హరీష్ రావుల ఆధిపత్యంపై కవిత అసంతృప్తిని సూచిస్తున్నాయి.
బీజేపీతో (BJP) బీఆర్‌ఎస్ సంబంధాలపై కూడా కవిత లేఖలో పరోక్షంగా ప్రస్తావించారు. “బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంది. బీజేపీ వల్ల నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను” అని కవిత రాసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన లేఖలో ఉంది. గత ఎమ్మెలీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీజేపీకి మద్దతిచ్చిందన్న సందేశం కాంగ్రెస్ (Congress) ద్వారా బలంగా వెళ్లిందని, దీనిపై సభలో బీజేపీని బలంగా టార్గెట్ చేయాల్సిందని కవిత సూచించారు. ఈ విమర్శలు, కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయాలపై కవిత ప్రశ్నలు సంధించినట్లయ్యాయి.
వరంగల్ సభలో కార్యకర్తలను ఆకట్టుకోవడంలో పార్టీ విఫలమైందని కవిత లేఖలో పేర్కొన్నారు. “ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలమయ్యాం. ఇప్పటికైనా ఒకటి, రెండు ప్లీనరీ సెషన్లు నిర్వహించి, క్యాడర్‌కు సరైన గైడెన్స్ ఇవ్వాలి” అని కవిత సూచించారు. ఈ వ్యాఖ్యలు, పార్టీలో సంస్థాగత బలోపేతం కోసం కవిత సూచన చేసినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌లో తన పాత్రను బలోపేతం చేసుకోవడానికి కవిత ఈ లేఖను ఒక వ్యూహంగా ఎంచుకుని ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేసీఆర్ కుటుంబంలో విభేదాల ఊహాగానాలు గతంలోనూ వినిపించాయి. కేటీఆర్‌ను పార్టీ అధ్యక్ష పదవికి వారసుడిగా కేసీఆర్ ఎంచుకున్నారని, కవితకు ప్రముఖ పాత్ర ఇవ్వడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కవిత లేఖను కేటీఆర్, హరీష్ రావులతో ఉన్న అభిప్రాయ బేధాల సూచికగా చూస్తున్నారు.
కవిత లేఖ బీఆర్‌ఎస్ కేడర్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. కవిత లేఖలోని విమర్శలు పార్టీలో సంస్థాగత మార్పుల అవసరాన్ని హైలైట్ చేస్తున్నాయని, అయితే ఇది కుటుంబంలోని అధికార పోరును మరింత స్పష్టం చేస్తుందని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని పెట్టుకొచ్చారు. ఇప్పుడీ లేఖతో వాటికి మరింత బలం చేకూరినట్లయింది.