Kavitha: ఆ లేఖ నాదే..! నా దేవుడు కేసీఆరే..!! కానీ…!!?

బీఆర్ఎస్ (BRS) అధినేత కెసీఆర్ (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత రాసినట్లుగా చెబుతున్న ఓ లేఖ రెండు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ సమయంలో ఆమె అమెరికాలో ఉండడంతో ఈ లేఖ పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు కవిత అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ లేఖపై సంచలన విషయాలు వెల్లడించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ తనదేనని కవిత స్పష్టం చేశారు. పార్టీలో మంచి చెడులను అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకే తాను ఆ లేఖ రాశానని, ఆ లేఖ బయటకు రావడం వెనుక కొంతమంది కోవర్టుల హస్తం ఉందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. తాను కేసీఆర్ వెంటే నడుస్తానని, ఆయన దేవుడని ఆమె వెల్లడించారు. అయితే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయని ఆమె విమర్శలు గుర్తించారు.
అంతకుముందు హైదరాబాద్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కవితకు ప్లకార్డులు పట్టి స్వాగతం తెలిపారు. సామాజిక తెలంగాణ ధ్యేయంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం సుస్వాగతం అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే వీటిలో ఎక్కడా కెసిఆర్ లేదా కేటీఆర్ బొమ్మలు కనిపించలేదు. గతంలో కవిత ఎప్పుడు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చినా బీఆర్ఎస్ శ్రేణుల హడావుడి కనిపించేది. అయితే తొలిసారి కవితకు బీఆర్ఎస్ శ్రేణులు కాకుండా ఆమె అభిమానులు, అనుచరులు స్వాగతం పలికారు.
కవిత వ్యాఖ్యలు టిఆర్ఎస్ లో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసాయి. కెసిఆర్ దేవుడైనప్పుడు ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న పెద్ద ప్రశ్న. సోదరుడు కేటీఆర్ తో విభేదాలు ఉన్నాయని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. కేటీఆర్ ను ఉద్దేశించే ఆమె అలా మాట్లాడారా అనేది ఇప్పుడు అనుమానం కలిగిస్తుంది. అలాగే పార్టీ అధినేతకు రాసిన లేఖను బయటకు రావడం వెనుక కోవర్టులు ఉన్నారంటూ ఆమె అనడం కూడా కేటీఆర్ ను ఉద్దేశించే అని ఉండచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కవిత వ్యాఖ్యలు టిఆర్ఎస్ లో అంతర్గత పోరును మరోసారి బయటపెట్టాయి.