Jordan: జోర్డాన్ నుంచి తెలంగాణాకు చేరుకున్న వలస కార్మికులు
బతుకు దెరువు కోసం జోర్డాన్ (Jordan) వెళ్లి చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. జోర్డాన్లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు, రవాణ ఖర్చును భరించి బాధితులను ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తెలంగాణాకు రప్పించ్చారు. శంషాబాద్ విమానాశ్రయం లో దిగిన బాధితులు, నేరుగా హరీశ్ రావు ఇంటికి వెళ్లి కలిశారు. తమను తిరిగి భారత దేశానికి తీసుకొచ్చిన హరీశ్ రావుకు, బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని వారికి భరోసా ఇచ్చారు. రాష్ట్రం లోనే ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ తమ సొంతూళ్లకు చేరుకున్నారు.







