Malla Reddy : జూబ్లీహిల్స్ లో సందడంతా మల్లారెడ్డిదే..!!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By election) ప్రచారం ప్రస్తుతం తారస్థాయికి చేరుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే, ఈ ఎన్నికల ప్రచారంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తూ, ఎక్కడికెళ్లినా జన సంద్రాన్ని సృష్టిస్తున్నార బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy). నియోజకవర్గ ప్రచారంలో అందరినీ తమ వైపు తిప్పుకుంటున్నారాయన. తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి శైలి భిన్నం. ఆయన ఎక్కడ ఉన్నా ఆ ప్రాంతమంతా జాతర వాతావరణాన్ని తలపిస్తుంది. తనదైన చమత్కారం, మాస్ అప్పీల్‌తో ఓటర్లకు మరింత చేరువయ్యే ఆయన, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం అలుపెరుగని ప్రచారం చేస్తున్నారు.
సాధారణ ఎన్నికల ప్రచారాలకు భిన్నంగా, ఈ ఉపఎన్నికల ప్రచారాన్ని మల్లారెడ్డి ఒక వినూత్న కార్యక్రమంగా మలిచారు. ముఖ్యంగా, ఆయన నోటి వెంట తరచూ వినిపించే డైలాగ్.. “పూలమ్మినా, పాలమ్మినా…” ప్రస్తుతం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఒక్క డైలాగ్‌తోనే ఆయన హల్‌చల్ చేస్తున్నారు. కేవలం ఉపన్యాసాలతో సరిపెట్టకుండా, సామాన్య ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయి వారి కష్టసుఖాలను పంచుకుంటూ ఓట్లను అడుగుతున్నారు.
జూబ్లీహిల్స్ వీధుల్లో మల్లారెడ్డి ప్రచారం చేస్తున్నారంటే, అక్కడ ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. కేవలం ఉపన్యాసాలు, కరపత్రాల పంపిణీకి మాత్రమే పరిమితం కాకుండా, ఆయన అక్షరాలా ఓటరు దేవుడి జీవితంలోకి దూరిపోయారు. కూరగాయల మార్కెట్‌కు వెళ్లి, స్వయంగా పూలు, పళ్లు, కూరగాయలు అమ్ముతూ వ్యాపారులను, కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచారు. “మేము సేవ చేసినా, కూరగాయలమ్మినా.. ప్రజల కోసమే,” అంటూ తనదైన శైలిలో మాట్లాడుతూ ఓటర్లను నవ్వుల్లో ముంచెత్తారు. స్థానిక సెలూన్ షాప్‌లోకి వెళ్లి, స్వయంగా కత్తెర పట్టి ఒకరిద్దరికి కటింగ్ చేశారు. తమ దుకాణంలో మల్లారెడ్డిని చూడగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. టిఫిన్ సెంటర్లలో దూరి, పెనంపై దోశెలు వేస్తూ, ఇడ్లీలు సర్వ్ చేస్తూ ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభివృద్ధి పనుల గురించి చాయ్, టిఫిన్ చేస్తూనే వివరించారు. చిన్నపిల్లలను ఎత్తుకుని ఆప్యాయంగా ఆడుకోవడం, వారిని ముద్దు పెట్టుకోవడం మల్లారెడ్డిలోని సున్నితత్వాన్ని చూపించింది.
నిజానికి, మల్లారెడ్డి ఈ ఉపఎన్నిక ప్రచారానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. పాలిటిక్స్ కంటే పీపుల్స్ కనెక్షన్ ముఖ్యమని ఆయన నమ్ముతారు. ఇలా ప్రతి సామాన్య పౌరుడి పనిలో భాగమైపోవడం ద్వారా, తాను కేవలం నాయకుడిని కాదని, మీలో ఒకడినే అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపగలుగుతున్నారు. ముఖ్యంగా, జూబ్లీహిల్స్ లాంటి విభిన్న వర్గాలున్న నియోజకవర్గంలో, సామాన్యుడి జీవితాన్ని పంచుకోవడం అనేది ఓటర్లను ప్రభావితం చేసే ఒక తెలివైన వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తం మీద, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కోసం మల్లారెడ్డి చేస్తున్న ప్రచారం ప్రస్తుతం ఓటర్లను ఆకట్టుకుంటోంది. ఆయన ఎక్కడుంటే అక్కడ జనం గుమిగూడటం, మీడియా కెమెరాలు ఫోకస్ చేయడం చూస్తుంటే… ఈ ఉపఎన్నికల ప్రచారంలో సందడంతా మల్లారెడ్డిదే అని చెప్పక తప్పదు.