Bus Accident:మృతులకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు : మంత్రి పొన్నం
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద (Bus Accident) ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇందులో మరణించిన తెలంగాణవాసులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడిరచారు. గాయపడ్డవారికి రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రవాణాశాఖను ఆదేశించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రమాదంపై ఏపీ రవాణాశాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ (District Collector), ఎస్పీలతో ఫోన్లో మాట్లాడాను. ఏపీ, కర్ణాటక, తెలంగాణ మధ్య రోజూ వేల మంది ప్రయాణిస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. దీనిపై మూడు రాష్టాల రవాణాశాఖ మంత్రులు(Ministers), కమిషనర్లతో సమావశం ఏర్పాటు చేస్తాం. ప్రమాదాల నియంత్రణకు స్పీడ్ లిమిట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం అని తెలిపారు. బస్సుల్లో రవాణాశాఖ రోజువారీ తనిఖీలు చేస్తే వేధింపులు అంటున్నారని పేర్కొన్నారు.







