నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా?: కేటీఆర్

గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొట్టడం సరికాదని, నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. నేతన్నలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నేతన్నల సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ‘‘నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోరా? కాంగ్రెస్ విధానాలు నేతన్నల బతుకులను నాశనం చేసేలా ఉన్నాయి. తమ ప్రభుత్వ హయాంలో నేతన్నలకు ఏటా ఇచ్చే ఆర్డర్లు ఇప్పుడు ఎందుకు నిలిపేశారు..? వెంటనే గతంలో మాదిరిగా వారికి చేతినిండా ఆర్డర్లు ఇవ్వండి’’ అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘‘బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలి. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ‘చేనేతమిత్ర’ వంటి పథకాలను ప్రభుత్వం పక్కన పెట్టింది. గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నల పొట్టకొట్టడం సరికాదు. వాళ్లు ప్రాణాలు తీసుకుంటున్నా పట్టించుకోకపోవడం బాధాకరం. వస్త్ర పరిశ్రమను ఆదుకోకుంటే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించాల్సిందే’’ అంటూ కేటీఆర్ తన లేఖలో రాసుకొచ్చారు.
సిగ్గు పడాలి: వాటర్ ట్యాంక్ ఘటనపై కేటీఆర్ ట్వీట్
నల్గొండ జిల్లా నందికొండ వాటర్ ట్యాంక్‌లో దాదాపు 30 కోతుల కళేబరాలు బయటపడడం స్థానికుల్లో ఆందోళనలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ఈ ప్రభుత్వం.. ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందంటూ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఇది మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన విషయం. తాగునీటి ట్యాంకుల నిర్వహణలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇది ఓ నిదర్శనం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.