పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్
ప్రపంచ పారిశ్రామికరంగంలో పరిచయం అవసరం లేని దిగ్గజ పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, ఆర్పీజీ (రామా ప్రసాద్ గోయెంకా) గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా. అటువంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ ఇటీవల ముంబైలో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఫార్ములా రేస్ కార్యక్రమంకోసం ముంబై వెళ్లిన కేటీఆర్ బిజీగా గడిపారు. సమయాన్ని వృథా చేయకుండా రాష్ట్రాభివృద్ధిలో దేశ పారిశ్రామిక దిగ్గజాలను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నించారు.
తెలంగాణలో వ్యాపార నిర్వహణ అత్యంత సులువు అని, భవిష్యత్తులో టాటా కార్యకలాపాల విస్తరణలో రాష్ట్రానికి కీలక స్థానం కల్పిస్తామని టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణలోని వివిధ రంగాల్లో టాటా గ్రూప్ పెద్ద ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నదని చెప్పారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో టాటా కార్పొరేట్ కేంద్ర కార్యాలయం-బాంబే హౌస్‌లో కేటీఆర్ సమావేశమై వివిధ వ్యాపార వాణిజ్య అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణలో టాటా గ్రూప్ కార్యకలాపాలు కొనసాగుతున్న తీరుపై చంద్రశేఖరన్ పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రగతిశీల విధానాలతో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలో తెలంగాణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రశేఖరన్‌కు విన్నవించారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా టాటా గ్రూప్ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నదని ప్రశంసిస్తూ, టీసీఎస్ కార్యకలాపాలను వరంగల్‌కు విస్తరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీ ప్రణాళికలతో ముందుకు పోతున్న టాటా గ్రూప్‌నకు తెలంగాణ అనుకూలమని వెల్లడిరచారు. విమానయాన రంగంలో భాగంగా హైదరాబాద్‌లో ఒక ఎమ్మార్వో (మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్)కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
మరో ప్రముఖ పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్ల్యూ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్‌తో ఆ సంస్థ కేంద్ర కార్యాలయంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థకు స్టీల్, సిమెంట్ వంటి రంగాల్లో ఉన్న అనుభవం దృష్ట్యా ఆ రంగంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జిందాల్‌ను కోరారు. జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకువస్తే, అన్ని సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. విద్య, క్రీడారంగం వంటి ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతాతో సమావేశమైన కేటీఆర్, తెలంగాణలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయంతో పాటు అనేక ఇతర ఆర్థిక సూచీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఆయా రంగాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిన నేపథ్యంలో తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ఎంచుకునేందుకు ఇదే సరైన అవకాశమని తెలిపారు. ఆర్పీజీ (రామా ప్రసాద్ గోయెంకా) గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంకాతోనూ మంత్రి కేటీఆర్ సమావేశమై, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర ప్రగతిపై చర్చించారు.






