Formula E-Race Case: స్పీడ్ పెంచిన ఏసీబీ.. కేటీఆర్ అరెస్ట్ ఖాయమా..?

ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) వ్యవహారం తెలంగాణలో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఒకవైపు ఏసీబీ (ACB), మరోవైపు ఈడీ (ED) ఈ కేసులో విచారణలు కొనసాగిస్తున్నాయి. ఏ క్షణంలో అయినా ఈ కేసులో కొందరిని అరెస్టు చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో (Supreme Court) కేటీఆర్ (KTR) కు ఎదురుదెబ్బ తగలడంతో ఆయన్ను అరెస్టు చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. గ్రీన్ ఎండీతో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ (Ace Nxtzen) కంపెనీకి నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఈ కేసులో ఉచ్చు బిగించేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్టు అర్థమవుతోంది.
ఏసీబీ నమోదు చేసిన ఫార్ములా ఈ-రేస్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ (KTR) వెనక్కు తీసుకున్నారు. ఈ కేసును కొట్టేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించకపోవడంతో కేటీఆర్ వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో కేటీఆర్ పై చర్యలు తీసుకునేందుకు ఏసీబీకి అవకాశం దొరికింది. అయితే కేటీఆర్ ను ఈడీ కూడా విచారిస్తుండడంతో ఏసీబీ ఆచితూచి వ్యవహరిస్తోంది. కేటీఆర్ ఇవాళ ఈడీ ఎదుట హాజరయ్యారు. ఏసీబీ ముందు హాజరయ్యేందుకు తప్పకుండా లాయర్లను అనుమతించాలని పట్టుబట్టిన కేటీఆర్.. ఈడీ ముందుకు మాత్రం వాళ్లు లేకండానే వెళ్లారు.
ఓ వైపు కేటీఆర్ ను ఈడీ విచారిస్తున్న సమయంలోనే ఏసీబీ ఈ కేసులో మరికొందరికి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ తో పాటు గ్రీన్ కో (Greenko) ఎండీ అనిల్ చలమలశెట్టికి (Anil Chalamala Shetty) నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ సహా అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది. ఇప్పుడు అనిల్ చలమలశెట్టికి కూడా నోటీసులు ఇవ్వడంతో ఈ కేసును కొలిక్కి తెచ్చేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఏర్పాటు వెనుక ఉద్దేశాలు.., మధ్యలో రేస్ నిర్వహణ నుంచి ఎందుకు తప్పుకున్నారు.. బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు.. తదితర అంశాలపై ఏసీబీ ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇంతకాలం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ ఏసీబీ విడివిడిగా విచారిస్తూ వచ్చింది. ఇకపై కేటీఆర్ ను అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి సమక్షంలో విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా మాట మార్చే అవకాశం లేకుండా జరిగిందేంటో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ కేసులో అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా అటు ఈడీ, ఇటు ఏసీబీ ఈ కేసులో నిజాలను నిగ్గు తేల్చేందుకు స్పీడ్ పెంచాయి.