Komatireddy Rajagopal Reddy: జానారెడ్డి ధృతరాష్ట్రుడు.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం తన ఆవేదనను, అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి రాకుండా సీనియర్ నేత కుందూరు జానారెడ్డి (K Jana Reddy) అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన్ను మహాభారతంలోని ధృతరాష్ట్రుడితో పోల్చారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చౌటుప్పల్ (Choutuppal) మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తన మంత్రి పదవిని కొందరు దుర్మార్గులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. జానారెడ్డి ధర్మరాజుగా ఉండాల్సిన వ్యక్తి అని, కానీ ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. 30 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన, ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారన్నారు. నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడం బాధాకరం అని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాజగోపాల్ రెడ్డి తన వాదనను బలపరిచేందుకు క్రికెటర్లు యూసుఫ్ పటాన్, ఇర్ఫాన్ పటాన్‌లను ఉదాహరణగా చెప్పారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు క్రికెటర్లుగా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తే ఎలాంటి సమస్య లేదని.. మరి ఒకే కుటుంబంలో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఇప్పటికే మంత్రిగా ఉన్న నేపథ్యంలో, తనకు మంత్రి పదవి ఇవ్వకూడదనే వారి అభ్యంతరాలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని, ముఖ్యంగా భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు. తాను నిద్రాహారాలు మాని భువనగిరి సీటు గెలిపించానని కోమటిరెడ్డి వివరించారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో మంత్రులకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చినా ఎంపీలు గెలవలేదన్నారు. కానీ నేను ఒక ఎమ్మెల్యేగా గెలిపించానని నొక్కిచెప్పారు.
మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదన్నారు. సామర్థ్యం ఆధారంగా వచ్చేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నాకు మంత్రి పదవి ఇస్తే కిరీటంలా కాదు, బాధ్యతగా స్వీకరిస్తానని ఆయన చెప్పారు. నేను గల్లా ఎగరేసుకునే వ్యక్తిని కాదు, అడుక్కునే స్థితిలో లేను.. అని ఆయన స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకే లాభమని, గతంలో తాను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బీజేపీకి, బీజేపీ తరఫున పోటీ చేస్తే కాంగ్రెస్‌కి నష్టం జరిగిందని గుర్తు చేశారు. రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి. జానారెడ్డి వంటి సీనియర్ నేతలపై బహిరంగ విమర్శలు, మంత్రి పదవి కోసం ఆయన చూపిస్తున్న అసహనం పార్టీ అధిష్ఠానానికి కొత్త సవాళ్లను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.