పార్టీ ఆఫీసుల్లో నోట్లు ముద్రిస్తారా? : కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్

కాంగ్రెస్ పార్టీ శుక్రవారం విడుదల చేసిన మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సెటైర్లు పేల్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి పార్టీ ఆఫీసుల్లో ఏమైనా నోట్లు ముద్రించే యంత్రాలు పెడతారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూత్ డిక్లరేషన్, మహిళ డిక్లరేషన్, ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్ పేరుతో శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముందుగా కాంగ్రెస్ నెరవేర్చాలన్నారు. నగరంలో శుక్రవారం జరిగిన బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతి మహిళకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో చేసిన హామీపై స్పందిస్తూ.. ఈ హామీ నెరవేర్చడానికి పార్టీ కార్యాలయాల్లో కరెన్సీ నోట్లు ముద్రిస్తారేమోనని సెటైర్ వేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మళ్లీ అదే స్ట్రాటజీతో ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు.
డిక్లరేషన్లు, గ్యారంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్న కిషన్ రెడ్డి.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా లోక్సభ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలో అధికారమే లక్ష్యంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. శుక్రవారం తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతులు, మహిళలు, యువత అభ్యున్నతే లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. న్యాయ్ పత్ర -2024 పేరుతో తమ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. తమ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను పొందుపరిచినట్లు వెల్లడించారు.