Kavitha: కేసీఆర్ ఫోటో లేకుండానే జనంలోకి కవిత

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే, ఆమె తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె యాత్రలో ఎక్కడా తండ్రి కేసీఆర్ ఫొటో కనిపించబోదు. బదులుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత, సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఈ యాత్రను డిజైన్ చేశారు. ‘జాగృతి జనం బాట’ పేరిట దీపావళి ముగిసిన వెంటనే కవిత యాత్ర ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో పర్యటించేందుకు ఆమె రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. తండ్రి ఫోటో పెట్టుకుంటే బీఆర్ఎస్ నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉందని కవిత భావిస్తున్నట్టు సమాచారం. అందుకే కేసీఆర్ ఫోటో లేకుండానే సొంతంగా జనంలోకి వెళ్లడం ద్వారా తన సత్తా ఏంటో చాటాలనే ఆలోచనలో ఆమె ఉన్నట్టు తెలుస్తోంది.
కవిత యాత్ర కేవలం పర్యటన మాత్రమే కాకుండా.. రాజకీయ భవిష్యత్తుకు మార్గం వేసేలా రూపొందించుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని మేధావులు, విద్యావంతులు, వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై, రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలనే అంశంపై వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకులపై ఆమె చేసిన పరోక్ష విమర్శల నేపథ్యంలో, ఈ యాత్రకు రాజకీయ ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రజల నుంచి వచ్చే స్పందన, లభించే మద్దతును బట్టి కవిత సొంత రాజకీయ పార్టీని ప్రకటించే యోచనలో ఉన్నారని సమాచారం. కేసీఆర్ ఫొటోను పక్కనపెట్టి, ఉద్యమ నాయకుడి చిత్రంతో యాత్ర చేపట్టడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
తండ్రి వారసత్వాన్ని పక్కనపెట్టి, తెలంగాణ సిద్ధాంతాన్ని, సామాజిక న్యాయాన్ని తన రాజకీయ అజెండాగా మార్చుకున్న కవిత… ఈ యాత్ర ద్వారా ప్రజల మద్దతును కూడగట్టుకుని, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శక్తిగా ఆవిర్భవించనున్నారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. మొత్తానికి, కవిత యాత్ర తెలంగాణ పాలిటిక్స్‌లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.