KCR: కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..! విచారణలో కీలక మలుపు..!!

తెలంగాణలో నాటి కేసీఆర్ (KCR) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం (Kaleswaram). అయితే ఇందులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (Justice P C Ghosh Comission) నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిషన్ అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్.. ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని కోరింది. అలాగే హరీశ్ రావు (Harish Rao), ఈటల రాజేందర్ (Etela Rajendar) కు కూడా నోటీసులు పంపించింది. దీంతో ఈ విచారణ మరో మలుపు తీసుకుంది.
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR), మాజీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ ముగ్గురు నాయకులు ప్రాజెక్టు నిర్మాణంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని, బ్యారేజీల డిజైన్, నిర్మాణ స్థల ఎంపిక, ఆర్థిక వ్యవహారాల్లో వారి పాత్ర గురించి సాక్ష్యాలు సేకరించినట్లు కమిషన్ పేర్కొంది. నోటీసులకు 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, అలాగే వ్యక్తిగతంగా హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటెల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాలని సూచించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు.. గోదావరి నదిపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మితమైన బహుళ ప్రయోజన నీటిపారుదల పథకం. దీని లక్ష్యం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం. 2016లో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు రూ. 80,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది రూ. 1.47 లక్షల కోట్లకు చేరింది. అయితే మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్, నిర్మాణ లోపాలు, నిర్వహణలో నిర్లక్ష్యం వంటి సమస్యలు ఈ ప్రాజెక్టును వివాదాస్పదంగా మార్చాయి. ఈ లోపాల వల్ల రూ. వేల కోట్ల ప్రజాధనం వృథా అయినట్లు ఆరోపణలు వచ్చాయి.
విచారణలో భాగంగా కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ప్రశ్నించింది. అఫిడవిట్‌లు సేకరించి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి, కేసీఆర్, హరీష్ రావులు డిజైన్లను త్వరగా ఆమోదించాలని ఒత్తిడి చేశారని కమిషన్ ముందు వెల్లడించారు. అలాగే, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, కాగ్ అధికారులు కూడా విచారణలో పాల్గొన్నారు. ఈ విచారణలో బ్యారేజీల నిర్మాణ స్థల ఎంపిక, డిజైన్ మార్పులు, ఆర్థిక అవకతవకలపై ప్రధాన దృష్టి సారించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, నాణ్యతా లోపాలపై నిపుణుల కమిటీ నివేదికలను కమిషన్ పరిశీలించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 48,665 కోట్ల విలువైన పనులను పర్యవేక్షించిన ఈఎన్సీ భూక్యా హరిరామ్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇటీవలే అరెస్టయ్యారు.
తాజా నోటీసులతో కేసీఆర్, హరీష్, ఈటెల రాజేందర్‌లపై విచారణ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గతంలో భూపాలపల్లి జిల్లా కోర్టు కూడా వీరికి నోటీసులు జారీ చేసినప్పటికీ, హైకోర్టు ఆ నోటీసులను సస్పెండ్ చేసింది. ఈసారి కమిషన్ విచారణకు వారు హాజరవుతారా లేక చట్టపరంగా ఎదుర్కొంటారా అనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఈ నెలాఖరలోపు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే రెండ్రోజుల కిందటే కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మరింత మందిని విచారించి సమగ్రంగా నివేదిక అందించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.