Jubilee Hills: జూబ్లీహిల్స్ బరిలో 81 మంది
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో నామినేషన్ల లెక్క తేలింది. సుదీర్ఘ పరిశీలన అనంతరం 81 మంది నామినేషన్లను రిటర్నింగ్ అధికారి సాయిరాం (Sai Ram) ఆమోదించారు. బుధవారం ఉదయం 11 గంటలకు మొదలైన స్ర్కూటినీ గురువారం తెల్లవారుజాము వరకు సుమారు 17 గంటలపాటు సాగింది. మొత్తం 211 మంది 321 సెట్ల నామినేషన్లు (Nominations) దాఖలు చేశారు. ఇందులో 130 మంది నామినేషన్లను పలు కారణాలతో తిరస్కరించారు. ఎక్కువగా స్వతంత్రులు, ఎన్నికల సంఘం (Election Commission) గుర్తింపు లేని పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సరైన పత్రాలు సమర్పించకపోవడం, ఫారం పూర్తిగా నింపకపోవడం, ఇతర నియోజకవర్గాలకు చెందిన వారిని బలపరచాల్సిన పది మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందినవారు కాకపోవడం వంటి కారణాలతో నామినేషన్లను తిరస్కరించినట్టు అధికారులు తెలిపారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం ఆఖరు తేదీ. దీంతో బరిలో ఉండేది ఎందరు? తప్పుకొనేది ఎవరన్నది శుక్రవారమే తేలనుంది.







