JD Lakshmi Narayana: కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో స్పష్టత లేదు, లేఖల్లా ఉన్నాయన్న జేడీ లక్ష్మీనారాయణ!

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్‌కు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) మద్దతుగా నిలిచారు. ఈ కేసులో ఎలాంటి అవినీతి లేదని, తనపై కావాలనే రాజకీయ కక్షసాధింపు కోసమే ఈ కేసు పెట్టారని కేటీఆర్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేటీఆర్‌కు ఏసీబీ ఇచ్చిన నోటీసులపై జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు ఏసీబీ జారీ చేసిన నోటీసుల్లో ఏమాత్రం స్పష్టత లేదని, విచారణ కోసం ఇలా నోటీసులు ఇచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఇస్తున్నారో నోటీసుల్లో పేర్కొంటారని లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) వివరించారు. అయితే కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో ఆ వివరాలేవీ లేవని, కేటీఆర్‌కు ఇచ్చినవి నోటీసుల్లా కాకుండా లేఖల్లా ఉన్నాయని ఆయన చెప్పారు. కేటీఆర్‌కు ఏసీబీ సీఆర్పీసీ సెక్షన్ 160 (ప్రస్తుతం 179 బీఎన్ఎస్) కింద నోటీసులు ఇచ్చిందని చెప్పిన ఆయన (JD Lakshmi Narayana).. ఈ కేసులో ఎఫ్ఐఆర్‌లో కేటీఆర్ నిందితుడు మాత్రమే కాబట్టి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు ఇవ్వకూడదని వివరించారు. కేటీఆర్ నుంచి ఏదైనా డాక్యుమెంట్ తీసుకోవాలంటే బీఎన్ఎస్ 94 (గతంలో సీఆర్పీసీ సెక్షన్ 91) కింద నోటీసు ఇవ్వాలని, కానీ ఏసీబీ అలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు.