కమలం ‘సేనాని’
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపెట్టుకుని బీజేపీ బరిలోకి దిగుతోంది. అంతేకాదు.. జనసేనకు ఎనిమిది స్థానాలు సైతం కేటాయించింది. అందులోనూ గ్రేటర్ పరిధిలో ఒక్క కూకట్ పల్లి మాత్రమే ఉంది. మిగిలినవన్నీ జిల్లాల్లో ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో జనసేనకు కనీస పార్టీ నిర్మాణం లేదు. ప్రకటించిన అభ్యర్థులు కూడా కనీసం ప్రముఖులు కాదు. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ కూడా ఏమంత బలంగా లేదు. అయినా పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కనీసం వార్డు మెంబర్ స్థానాల్లో కూడా పోటీ చేయలేదు. నేరుగా అసెంబ్లీకి పోటీ చేస్తోంది. ఫలితం ఎలా ఉన్నా పర్వాలేదని తేలికగా తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే తర్వాత నాలుగైదు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఏపీలో పార్టీ బలోపేతంపైనా తొలి నుంచి ఫోకస్ పెట్టారు. పదేళ్ల కాలంలో ఏపీలో కాస్త నేతలను చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు. కానీ తెలంగాణలో పార్టీ నిర్మాణం జరగలేదు. అటు బీజేపీకి సరైన నాయకులు లేరు. ఇప్పుడు బీజేపీ-జనసేన కలిసి పోటి చేస్తే గెలిచే పరిస్థితి ఉంటుందా..? పవన్ కల్యాణ్.. బీజేపీకి ప్రచారసారధిగా మారడం తప్ప, గెలుపు సాధించే పరిస్థితులు ఉంటాయా..? ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ పోరు సాగుతున్న తరుణంలో.. జనం పవన్ ను చూసి ఓటేసే పరిస్థితి ఉంటుందా?
జనసేన పార్టీని తెలంగాణ గడ్డపైనే పవన్ కల్యాణ్ ప్రారంభించారు. కానీ గత పదేళ్ల కాలంలో ఆయన ఎప్పుడూ తెలంగాణలో పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగినా.. ఇక్కడి బీజేపీతో కలిసి ఆ పార్టీ ప్రతినిధులెవరూ స్టేజ్ షేర్ చేసుకోలేదు. బండి సంజయ్ పాదయాత్ర చేసినా.. కిషన్ రెడ్డి బస్సుయాత్ర చేసినా జనసైనికులు ఆ దరిదాపుల్లో కూడా కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ బీజేపీతో తాము కలిసి లేమని కూడా ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. కానీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాలనుకుని బీజేపీతో సంబంధం లేకుండానే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. మొదట బీజేపీ కూడా పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా బీజేపీతో పొత్తు కోసం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరిపారు. ఎనిమిది సీట్లు కేటాయించారు. ప్రధాని మోడీతో కలిసి ఎన్నికల ప్రచారం కూడా చేశారు.
ఇక ఇప్పటివరకూ కలసి పనిచేయని బీజేపీ, జనసేన పార్టీల కార్యకర్తలు కలసికట్టుగా ఎంతవరకూ పనిచేస్తారు. ఓటు ట్రాన్స్ ఫర్ చేసేంతగా వీరి ప్రచారం సాగుతుందా..? బీజేపీ బీజేపీ నేతల సహకారం ఎంత ఉంటుంది ? బాహుబలి సినిమాలో హీరోలా మొత్తం భారాన్ని తనపై వేసుకుని పవన్ బీజేపీని గెలిపించగలరా..? అదీ పక్కన పెడితే.. ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ నేతలను విమర్శించాల్సి ఉంటుంది. వీరితోపాటు కాంగ్రెస్ పైనా బాణాలు ఎక్కుపెట్టాలి. మరి ఇవన్నీ పవన్ పూర్తిస్థాయిలో చేసే పరిస్థితి ఉందా ..? ఇప్పుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.






