లాక్ డౌన్ తరువాత ఆఫీసులు తెరిస్తే… ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి?….ఎలా పనిచేయాలి?
ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కువగా చర్చించే విషయం లాక్డౌన్ కష్టాలు, విశేషాలు కాదు… ప్రజలు వాటికి అలవాటు పడిపోయారు. లాక్ డౌన్ సమయంలోనే కొన్ని ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నారు. ఆఫీసులు తెరుస్తున్నారు. అయితే ఒక సంస్థ 40 రోజులు లాక్డౌన్ తరువాత తెరవాలంటే ఏమిటి పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఆఫీసు తెరవాలంటే ముందుగా ఏం చేయాలి? తెరచిన తరువాత ఎలా నడవాలి? యా•జమాన్యం మనోభావాలు ఎలా ఉంటాయి. ఉద్యోగుల మనోభావాలు ఎలా ఉంటాయి. అస్సలు ఆఫీసులు తెరవడం క్షేమమేనా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇప్పటికిప్పుడు పూర్తిగా లభించేపరిస్థితులు లేకపోయినా ఆ వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో తెలుగు టైమ్స్ హైదరాబాద్‌లోని మౌలాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న యారో పబ్లికేషన్స్ అనే సంస్థ యాజమాన్యంతో మాట్లాడింది. యారో పబ్లికేషన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సివిబి కృష్ణ చెప్పిన వివరాల మేరకు ఆఫీసు తెరిచిన సమయంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నది తెలుస్తోంది. శ్రీ కృష్ణ చెప్పిన వివరాలు క్లుప్తంగా ఇక్కడ ఇస్తున్నాం
* మాది మౌలాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న ఒక చిన్న సంస్థ. యారో పబ్లికేషన్స్ ప్రై లిమిటెడ్ ద్వారా మేము గత 20 ఏళ్ళలో స్కూల్ పుస్తకాలు ముద్రించి, అన్ని ప్రధాన నగరాలలోను ఉన్న బుక్ ట్రేడర్స్ ద్వారా, స్కూల్ టెక్స్ బుక్స్ సప్లైయి చేస్తాము. దేశంలోని ముఖ్యమైన స్కూల్స్ వారు మా పుస్తకాలు వాడుతారు. 1 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు అన్ని సబ్జెక్ట్ లలోను టెస్ట్ బుక్స్ ముద్రించి , సూళ్ళకు సరఫరా చేస్తుంటాము. మా వ్యాపారం అంతా జనవరి నుంచి జూన్ వరకు జరుగుతుంది. ఈ సమయంలోనే మేము పుస్తకాలను ముద్రించటం స్కూల్ కి బుక్ట్రేడర్స్ కి పంపటం జరుగుతుంది.
* మార్చి, ఏప్రిల్, మే నెలలలో మేము ఎంతో శ్రమపడి సంవత్సరానికి మొత్తానికి సరిపోయే బిజినెస్ చేసుకొంటాం. అలాంటి మా సంస్థకి 40 రోజుల లాక్డౌన్ కోలుకోలేని నష్టాలను, కష్టాలను తెచ్చింది. ఇప్పుడు లాక్డౌన్ నుంచి బయటకు వచ్చి మా ఆఫీసు తెరుస్తున్నందుకు కొంత సంతోషం, మరి కొంత ఆందోళన ఉంది.
* మొదటగా మాకు మా ఏరియా నుంచి, తెలంగాణా ఇండస్ట్రీయలిస్ట్ పెడరేషన్ (తెలంగాణ ఇండస్ట్రియలిస్టస్ ఫెడరేషన్-టిఐఎఫ్) ప్రెసిడెంట్ శ్రీ సుధీర్ రెడ్డి నుంచి 29 ఏప్రిల్ నాడు కబురు వచ్చింది. 30 ఏప్రిల్ 2020 నాడు, తెలంగాణ ప్రభుత్వం తరపున శ్రీ జయేష్‌రంజన్, సెక్రటరీ, ఇండస్ట్రీస్ వారితో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ మీటింగ్‌లోనూ ఆ తరువాత వచ్చిన సర్కులర్స్ లోను ప్రభుత్వం అనేక జాగ్రత్తలు, విధ విధానాలు సూచించింది.
* ముందుగా మా కంపెనీ వివరాలు ఆఫీసు లేదా ఫ్యాక్టరీ తెరవాలన్న ఆవశ్యకత ఉందా లాంటి వివరాలు, ఎంత మంది ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఎంత మంది ఆఫీసుకి 3 కి.మీ దూరంలో నివాసం ఉంటున్నారు. ఎంతమంది దూరాల నుంచి రావాలి? మేనేజ్మెంట్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి పాస్ అవసరం వస్తుంది? లాంటి అనేక వివరాలు సేకరించారు.
* నేను, నా తోటి డైరెక్టర్లు మొదటగా మే 1వ తేదీ మీ ఆఫీసుకి వెళ్ళి అక్కడ ఉన్న పని వాళ్ల చేత ఆఫీసుని పూర్తిగా కడిగించి, క్లీన్ చేయించాము. ముందుగానే మేము ఆఫీసు తెరవగానే ఉద్యోగులకు కావాల్సిన మాస్కులు, సానిటైజర్లు , రాగానే ఉద్యోగులకు టెంపరేచర్ చెక్ చేసే సాధనంలాంటివి కొని పెట్టుకొన్నాము. సోమవారం, 4 మే నుంచి ఆఫీసు రావటానికి కావాల్సిన మినిమమ్ సిబ్బంది ఎవరు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అనేక విషయాలపై మా డైరెక్టర్లు అందరూ కూలంకషంగా చర్చించుకున్నాము. ఏ పనులు చేయాలి లాంటి అనేక అంశాలు చర్చించుకుని నిర్ణయాలు తీసుకున్నాము.
* మా ఆఫీసులో దాదాపు 70 మంది పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యాజమాన్య సిబ్బందిగా ఐదుగురు డైరెక్టర్లు, 6గురు ఉద్యోగులతోనూ, మెషిన్ దగ్గర పనిచేసే ఇంకో 10 మంది కార్మికులతోనూ పనులను మొదలు పెట్టాము. ఇతర సిబ్బందిని మార్కెటింగ్ స్టాఫ్‌ని ఇప్పడు పిలవడం లేదు. పరిస్థితులు చక్కబడుతూ ఉంటే మెల్లమెల్లగా ఇతర ఉద్యోగులు జాయిన్ అవుతారు.
* నాకు, మరో ఇద్దరు డైరెక్టర్లకి ప్రభుత్వం వారి పాస్ లభించింది. మా ఆఫీసుకి ప్రభుత్వం ఇచ్చిన పాస్ ని కాపీలు తీయించి ఒక్కో ఎంప్లాయీస్‌కి పేరు, ఫోటో పెట్టి మా కంపెనీ తరుపున ఇచ్చిన ఐడీలాగా ఇచ్చాము. ఉద్యోగులకు ఆ ఐడీ పాస్‌లాగా ఉపయోగపడుతుంది.
* అయితే ఆఫీసు తెరవడం అనే సంతోషం కంటే అందరి ఆరోగ్యం, అందరి క్షేమం చూసుకోవాలన్న ఆందోళనే ఎక్కువగా ఉంది. ఉద్యోగస్తులందరికి ఆఫీసులో శానిటైజర్ వాడడం, మాస్క్‌లు వంటివి ఇస్తున్నా, వారు ఇంటికి క్షేమంగా వెళ్ళి అంతే క్షేమంగా, ఆఫీసుకు రావాలి అంటూ అన్ని జాగ్రతలు చెపుతున్నాం.
* ఆఫీసు తెరవగానే పని మొదలెట్టలేం. అనేక అవసరాలు ఉంటాయి. 40 రోజులు లాక్డౌన్ వలన ఆఫీసులో యుపిఎస్లన్నీ కూడా పని చేయడం లేదు. వాటికి డిస్టిల్డ్ వాటర్ కావాలి. రెండు మూడు పెట్రోల్ బంక్‌ల నుంచి మాకు కావలసిన డిస్టిల్డ్వాటర్ తెచ్చి జాగ్రత్తగా వాడడం మొదలెట్టారు.
* అలాగే మెషిన్లను క్లీన్ చేసి వాడటం మొదలెట్టాము అంటే వాటికి కావలసిన గ్రీస్, స్పేర్పార్టస్ అవసరం ఉంటుంది. అవన్నీ రాణిగంజ్ ప్రాంతంలో దొరుకుతాయి. కాని ఆ ప్రాంతంలో ఇంకా షాపులు ఓపెన్ అవలేదు. మేము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి చెప్పగా, వారు వెంటనే అర్థం చేసుకుని రాణిగంజ్‌లో త్వరలో దుకాణాలు ఓపెన్అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
* అలాగే మా ఉద్యోగులు వచ్చేటప్పుడు అనేక చోట్ల పోలీసులు ఆపి వారివివరాలు, ఆఫీసు వివరాలు అడిగి తెలుసుకుని పంపిస్తున్నారు. ఈ విషయంలో కూడా మేము మా ఏరియా పోలీస్ డిపార్ట్ మెంట్ లోని పెద్దలను కలుసుకుని అన్నీ వివరాలు వారికి ఇచ్చాము. సంస్థని నడిపించాలన్న ఆలోచన కంటే ముందుగా ఉద్యోగుల క్షేమం ముఖ్యం అన్న ఆందోళనతో మా పనులు మెల్ల మెల్లగా మొదలెడుతున్నాం.
* లాక్డౌన్ తరువాత ఇలాగే అన్నీ ఆఫీసులు కొంత ఇబ్బందులు ఎదుర్కొని ప్రారంభమైనా, వాటిలో పనిచేసే ఉద్యోగులు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంపైనే అన్నీ యాజమాన్యాలు దృష్టిని పెట్టి పనులను మెల్లమెల్లగా ప్రారంభిస్తున్నాయి.
ప్రభుత్వం ఎన్ని విడి విధానాలు చెప్పినా, ప్రతి యాజమాన్యం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా.. ప్రస్తుత కరోనా ని వారి కట్టాలంటే , జయించాలంటే ప్రతి వ్యక్తి కొరోనా వ్యాధి మీద పూర్తి అవగాహన తో వుండి అన్ని జాగర్తలు తీసుకొంటేనే మళ్ళి మనం సాధారణ పరిస్థితులలోకి వస్తామని శ్రీ CVB కృష్ణ తెలిపారు.






