Smita Sabharwal: స్మితా సభర్వాల్‌పై బదిలీ వేటు..!

తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ (IAS) అధికారి స్మితా సభర్వాల్ (Smita Sabharwal) ఇటీవల వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలిచారు. కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వివాదంపై ఆమె రీపోస్ట్ చేసిన ఒక ఏఐ-జనరేటెడ్ ఇమేజ్ ఆమెను రాజకీయ, పరిపాలనా వివాదాల కేంద్ర బిందువుగా మార్చింది. ఈ ఘటనతో ఆమెకు పోలీసు నోటీసులు జారీ కాగా, ఆ తర్వాత ఆమెను టూరిజం సెక్రటరీ (Tourism Secretary) పదవి నుంచి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా (Finance Commission Secretary) బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కంచ గచ్చిబౌలి వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) సమీపంలోని 400 ఎకరాల భూమిని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం వేలం వేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పర్యావరణవాదులు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ భూమిలో అటవీ సంపద, జీవవైవిధ్యం ఉన్నాయని, వృక్షాలను నరికివేయడం పర్యావరణానికి హానికరమని వారు వాదించారు. ఈ నేపథ్యంలో, స్మితా సభర్వాల్ మార్చి 31, 2025న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక ఏఐ-జనరేటెడ్ చిత్రాన్ని రీపోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ ను సైబరాబాద్ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఏప్రిల్ 12న స్మితా సభర్వాల్‌కు BNSS సెక్షన్ 179 కింద నోటీసు జారీ చేశారు. ఈ ఫోటో తప్పుదారి పట్టించిందని.. విద్యార్థులు, ఆందోళనకారులలో అశాంతిని రెచ్చగొట్టేలా ఉందని పోలీసులు ఆరోపించారు. స్మితా ఏప్రిల్ 19న గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో తన వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ లో స్పందిస్తూ.. ఈ ఫోటోను 2,000 మంది రీపోస్ట్ చేశారని, అందరిపై ఒకే విధమైన చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఒకవేళ కాదంటే ఇది సెలెక్టివ్ టార్గెటింగ్ గా ఉందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఆమెపై విమర్శలను మరింత తీవ్రతరం చేశాయి.
ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే స్మితా సభర్వాల్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. స్మితా సభర్వాల్‌ను యూత్ అడ్వాన్స్ మెంట్, టూరిజం అండ్ కల్చర్ సెక్రటరీ పదవి నుంచి తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా బదిలీ చేసింది. రాజకీయ కారణాలతోనే ఈమెను బదిలీ చేసారని భావిస్తున్నారు. స్మితా సభర్వాల్ గతంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెను ముందుగా సీఎం కార్యాలయం నుంచి ఫైనాన్స్ కమిషన్‌కు, ఆ తర్వాత టూరిజం విభాగానికి బదిలీ చేశారు. ఇప్పుడు మళ్లీ ఫైనాన్స్ కమిషన్ కే ట్రాన్స్ ఫర్ చేశారు.
2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన స్మితా సభర్వాల్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇవి ఆమెకు అప్పుడప్పుడు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. గతంలో కూడా యూపీఎస్సీలో దివ్యాంగుల రిజర్వేషన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. అయితే ఆమెకు వాక్ స్వాతంత్ర్యం ఉన్నప్పటికీ ఆమె సివిల్ సర్వెంట్ గా ఉన్నత స్థానంలో ఉన్నారని.. ఇలా మాట్లాడడం తగదని కొందరు సూచిస్తున్నారు.