Harish Rao: వారికి సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం : హరీశ్‌రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్ల (Auto drivers) పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. ఎర్రగడ్డలో ఆటో కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు ఆటోలో వెళ్లారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆటో కార్మికులను రాహుల్‌గాంధీ మోసం చేసి ఓట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. వారికి సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆటో కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ రెడ్డి అమలు చేయలేదు. వారిని రోడ్డున పడేశారు. బాకీ పడిన రూ.24 వేలు వెంటనే చెల్లించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే హామీని నెరవేరుస్తారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున చెల్లించాలి అని డిమాండ్ చేశారు.







