ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి: హరీశ్‌రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్లేసిన ప్రజలనే కాంగ్రెస్ మోసం చేసిందని హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామన్న కాంగ్రెస్.. గెలిచిన తర్వాత మడమ తిప్పిందని, రైతులకు ఇస్తామన్న రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదని నిలదీశారు. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు ఊర్ల మీద వచ్చి పడుతున్నారని, 100 రోజులు దాటినా రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
‘‘రుణమాఫీ డబ్బులు రాలేదని.. బ్యాంకు అధికారులు రైతుల ఇళ్లపై పడ్డారు. రూ. 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయండి. రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్‌కు ఓటేయండి. వరి పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామన్నారు.. ఇచ్చారా? వడ్లపై దృష్టిపెట్టమంటే.. రేవంత్‌రెడ్డి వలసలపై దృష్టి పెట్టాడు. కేశవరావు, దానం నాగేందర్, ఇతర బీఆర్ఎస్ నేతల ఇండ్ల చుట్టూ తిరుగుతూ వాళ్లని తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు.. కానీ ఒక్క హామీ కూడా అమలు కాలేదు. 4 నెలల కాంగ్రెస్ పాలనతోనే రాష్ట్ర ప్రజలను నానా తిప్పలు పెట్టారు’’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న హరీశ్‌రావు.. పంటకోతకు వచ్చినా ఇప్పటికీ రైతుల ఖాతాల్లో రైతుబంధు పడలేదన్నారు. కాంట్రాక్టర్‌లకు కమిషన్లు ఇస్తున్నారు కానీ రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమ హయాంలో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, కానీ కాంగ్రెసోళ్లు కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో కొద్దిగా ఆలోచించి ప్రజలు ఓటెయ్యాలని సూచించిన హరీశ్‌రావు.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టేనని, జూటా మాటల కాంగ్రెస్‌కు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.