Harish Rao :రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనే ఇదే పరిస్థితి : హరీశ్ రావు

ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని ఢిల్లీ కి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు (Employees) రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొందని ఆక్షేపించారు. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులకు, మూడు నెలలుగా ఉపాధి హామీ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై అప్పులపాలవుతున్నారన్నారు. తన కుర్చిని కాపాడుకోవడం కోసం ఢిల్లీ (Delhi) కి చక్కర్లు కొట్టడం, విదేశాల నుంచి రూ.వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.