BRS – KTR: గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్‌కు విరాళాలు.. కేటీఆర్ అడ్డంగా బుక్ అయిపోయారా..?

తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్ (Formula E-Race) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ వెనుక భారీ కుంభకోణం జరిగిందని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం ఆరోపిస్తోంది. సంబంధం లేకపోయినా ప్రభుత్వం నిధులు బదిలీ చేసిందని.. ఇందుకు అప్పటి మంత్రి కేటీఆర్ (KTR) బాధ్యులని కేసు నమోదు చేసింది. దీనిపై ఇప్పుడు ఏసీబీ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. అయితే ఈ-రేస్ స్పాన్సర్ కంపెనీ ఏస్ నెక్స్ట్ జెన్ (Ace NextZen) మాతృసంస్థగా చెప్తున్న గ్రీన్ కో (Green Co) నుంచి బీఆర్ఎస్ కు పెద్దఎత్తున విరాళాలు అందినట్లు తాజాగా రుజువైంది. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తి రేపుతోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ-రేస్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ-రేస్ నిర్వహణ ద్వారా హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలబెట్టవచ్చని భావించారు. అందుకోసం ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కంపెనీ FEOతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ రేస్ నిర్వహణ బాధ్యతను తాము చూసుకుంటామంటూ ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ ముందుకొచ్చింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీ గ్రీన్ కోలో డైరెక్టర్లుగా ఉన్న అనిల్ చలమలశెట్టి (Anil Chalamalashetty), మహేశ్ కొల్లి (Mahesh Kolli) ఈ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. రేస్ నిర్వహణకు 4 నెలల ముందు ఈ కంపెనీ రిజిస్టర్ అయింది. పైగా గ్రీన్ కో డైరెక్టర్లకు ఇలాంటి రేస్ నిర్వహణలో ఏమాత్రం అనుభవం కూడా లేదు.
అయినా రేస్ నిర్వహణకు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ముందుకు వచ్చింది. ప్రభుత్వం కూడా అంగీకరించించింది. 2023 ఫిబ్రవరి 11న మొదటి దఫా రేస్ కూడా పూర్తయింది. అయితే ఈ రేస్ నిర్వహణ వల్ల తమకు నష్టం కలుగుతోందంటూ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ మధ్యలోనే తప్పుకుంది. దీంతో ఫార్ములా ఈ-రేస్ మాతృ సంస్థ తమకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వానికి నోటీస్ పంపించింది. దీంతో ప్రభుత్వం HMDA నుంచి నిధులు విడుదల చేసింది. HMDA, RBI అనుమతి లేకుండా ఈ నిధులను బదిలీ చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పడం వల్లే తాము నిధులను బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ మాతృసంస్థగా భావిస్తున్న గ్రీన్ కో కంపెనీ పలు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్లు సమర్పించినట్లు తాజాగా బయటకు వచ్చింది. 2022 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ మధ్య రూ.41 కోట్ల విలువైన బాండ్లను గ్రీన్ కో బీఆర్ఎస్ కు బాండ్లు సమర్పించినట్లు ప్రభుత్వం బయటపెట్టింది. ఫార్ములా ఈ-రేస్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న సంస్థల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల విరాళాలు (Electoral Bonds) వెళ్లడంపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ-రేస్ వ్యవహారం వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఇప్పుడు ఎన్నికల విరాళాల ద్వారా అది రుజువైందని చెప్తోంది.