WTF: హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన డబ్ల్యుటీఎఫ్ మహాసభలు

హైదరాబాద్ (Hyderabad) లోని హెచ్‌ఐసిసి వేదికగా ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు (WTF) 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. హైదరాబాద్‌కు తెలుగు పండుగొచ్చింది.. జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెచ్ ఐ సిసి నోవాటెల్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులతోపాటు బిజినెస్ రంగానికి చెందిన పలువురు తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. సినిమా కళాకారులు, సాహితీవేత్తలు, వివిధ రంగాల్లో పేరుగాంచిన మహిళామణులు కూడా ఈ మహాసభలకు వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బిజినెస్ సదస్సులు, మహిళా సదస్సులు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు. ప్రముఖ గాయకుడు రామ్ మిర్యాలతో ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఉర్రూతలూగించింది. తెలుగుదనం కనిపించేలా కార్యక్రమాలను కూడా నిర్వహించడంతో పాటు విదేశీ తెలుగు సంఘాల ప్రతినిధులను సత్కరించారు.
జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు హెచ్ ఐ సిసి నోవాటెల్‌లో ఈ మహాసభలు పలువురి ప్రముఖులతో, విదేశీ ప్రతినిధులతో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ విలువలను, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం మరియు భావితరాలకు అందించడానికి తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలను హైదరాబాద్‌లో వైభవంగా నిర్వహించింది. ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా దత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు పాల్గొని మాట్లాడారు.
మహాసభల ప్రారంభదినం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడారు.. ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు..శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే.. అదే తెలుగుజాతి. తెలంగాణ, ఏపీ, ఆస్ట్రేలియా, అమెరికా.. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చారు. వివిధ దేశాల సమాఖ్యల అధ్యక్షులు ఇక్కడకు వచ్చారు. నా జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. తెలుగు భాష, సంప్రదాయాలు, సంస్కృతిపై ఇష్టం, గౌరవంతో ప్రపంచ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. నిజం చెప్పాలంటే.. ఏపీ, తెలంగాణలో ఉండే తెలుగువారికంటే భాష, సంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే’’ ‘‘ఏం చేయాలన్నా ఒక దూరదృష్టి ఉండాలి. ఒక నిర్దుష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్‌లో జరగబోయే విషయాలను మనం ముందుగానే ఆలోచించాలి. తగిన విధంగా ముందుకు వెళ్లగలిగితే ఏదైనా సాధ్యమే. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. 25 సంవత్సరాల్లో ఇది సాధ్యమైంది.
తెలుగువారు ఎక్కడున్నా రాణిస్తున్నారు. 1996లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ తిండి పెడుతుందా అని అప్పట్లో ఎంతో మంది హేళన చేశారు. సెల్‌ఫోన్లు ప్రమోట్ చేస్తే.. ఏమన్నా ఉపయోగమా? అని ప్రశ్నించారు. కానీ ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు దూసుకెళ్తున్నారు. ఐటీలో రాణిస్తున్నవారు తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఆనాడు తెదేపా ప్రభుత్వం వేసిన పునాది కారణంగానే ఇక్కడ ఆదాయం పెరిగింది. చదువు, సంపద, జనాభాకు అవినాభావ సంబంధం ఉంటుంది. కొన్ని దేశాల్లో జనాభా రేటు తగ్గిపోతోంది. జపాన్, జర్మనీ దేశాలు భారతీయుల వైపు చూస్తున్నాయి’’ ఐక్యంగా ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలి అన్నారు. ‘దేశ విదేశాల్లో తెలుగువారు గొప్పగా రాణిస్తున్నారు. తెలుగువారు ఎక్కడున్నా పరస్పరం సహకరించుకోవాలి. ఐక్యంగా ఉండి ఉన్నత స్థానాలకు ఎదగాలి. ఏ ఏ రంగాల్లో అవకాశాలు ఉన్నాయో తెలుగువారికి బాగా తెలుసు. విజన్ 2047తో ముందుకెళ్తున్నాం. 2047 నాటికి మనం ప్రపంచంలోనే మొదటి, రెండో స్థానంలో ఉంటాం. చిన్న ఆలోచనతో అనేక మంది తెలుగువారు కోటీశ్వరులు అయ్యారు. చిన్న ఆలోచనతో ర్యాపిడోను స్థాపించి గొప్పగా రాణించారు.
కో-వర్కింగ్ స్పేస్ ద్వారా వేలమందికి ఉపాధి కల్పిస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తే మరింత రాణిస్తారు. జీరో పావర్టీ మన లక్ష్యం కావాలి. 90 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించిన ఘనత మనది. టాప్-10లో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు ఇతరులకు మెంటార్‌గా ఉండాలి. ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. పుట్టిన రాష్ట్రాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు చేయాల్సింది హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్. టెక్నాలజీని సరిగా వినియోగించుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. తెలుగు వారికి గౌరవం తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగు భాషకు గిడుగు రామ్మూర్తి ఎంతో సేవ చేశారు. తెలుగు భాష వికాసానికి రామోజీరావు ఎంతో కృషి చేశారు’’ అని చంద్రబాబు అన్నారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా దత్ మాట్లాడుతూ, రెండేళ్లకు ఒకసారి తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఈ మహాసభలకు ఆహ్వానించి సన్మానిస్తున్నామని చెప్పారు. 1993లో ఈ మహాసభలకు శ్రీకారం చుట్టాము. తొలి మహాసభలు 1996లో హైదరాబాద్‌లో జరిగాయి. దాదాపు 30 ఏళ్లకు మళ్లీ ఇప్పుడు రెండోసారి నగరంలో ఏర్పాటు చేశాము. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, దిల్లీ, సింగపూర్, దుబాయ్, మలేసియాలలో మహాసభలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మహాసభలకు ఇంతమందిరావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని సంఘటితం చేసి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సంప్రదాయ విలువలు, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపుష్టి చేయడమే ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముఖ్య ఉద్దేశం అని వివరించారు. అలా పరిపుష్టి చేసిన వారసత్వ సంపదను నేటి, భావితరాలకు అందించడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
మహాసభల్లో పూర్వ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లేనని, అమ్మలాంటి తెలుగు భాషను అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పప్పు నెయ్యి కలిపి తినిపించినట్లు తెలుగు భాష మాధుర్యాన్ని తరువాతి తరాలకు అందించాలి. తెలుగువారు గొప్పవారే అన్న పేరు కన్నా, తెలుగు భాషను గొప్పగా చెప్పుకునేలా తెలుగువారు కృషి చేయాలి. వేర్లు భూమిలో ఉంది మొక్కను ఎలా సంరక్షిస్తుందో, అలాగే మనం కూడా మనమూలాలను కాపాడుకున్నప్పుడే భాష, సంస్కృతి పదిలంగా ఉంటుంది. మన భాషతోపాటు ఇతర భాషలను ప్రేమిద్దాం, ప్రాధమిక విద్యలో తెలుగును బోధిస్తున్నట్లే పరిపాలన వ్యవహారాల్లో కూడా మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. న్యాయస్థానాల్లో కూడా వాదనలు, తీర్పులు కూడా తెలుగులోనే ఉండేలా చూడాలని ఎం. వెంకయ్యనాయుడు కోరారు. ప్రాథమిక విద్య, పరిపాలన వ్యవహారాలు, న్యాయస్థానాల కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలోనే జరగాలని, క్రమంగా సాంకేతిక విద్యలోనూ వినియోగం పెరగాలని, ప్రతిఒక్కరూ తమ ఇళ్లలో అమ్మ భాషలోనే మాట్లాడాలని సూచించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వ ఉత్తర్వులన్నింటినీ తెలుగులోనే వెలువరించాలన్నారు. దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 4వ స్థానంలో ఉంటే, ప్రపంచంలో 15వ స్థానంలో ఉందని, అమెరికాలో భారతీయ భాషలు మాట్లాడేవారిలో తెలుగువారే ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయని అన్నారు. ఈ గుర్తింపును కాపాడుకోవాలంటే భాషను పరిరక్షించుకోవాలని, మరింత విస్తృతం చేసుకోవాలని చెప్పారు. అంతకుముందు గొరవ నృత్యం, చెక్క భజనలను కళాకారులు ప్రదర్శించారు. సంక్రాంతి వేడుకలపై సంగీత-నృత్యరూపక ప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులను వెంకయ్యనాయుడు అభినందించారు.
మహాసభల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ తెలుగు సమాఖ్య సందర్భంగా వచ్చిన తెలుగువారి అందరికీ శుభాకాంక్షలు. తెలుగు భాష అత్యంత ప్రాచీన భాష. ఈ భాష గొప్పతనం ప్రపంచ దేశాలకు తెలిసేలా తేటతేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా అని పాడుతాం. తెలుగులో ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. ప్రపంచంలో అత్యంత మధురమైన భాష తెలుగు. దేశ భాషలందు తెలుగు లెస్సా అని కృష్ణ దేవరాయలు ఊరికే అనలేదు. ప్రాచీన తెలుగు సాహిత్యానికి కేంద్రం ఎనలేని గౌరవం ఇచ్చింది. తెలుగు భాషను ఎంతో మంది మహానుభావులు కొంతపుంతలు తొక్కించారు. నిజాం కాలంలో మన భాష అణగదొక్కబడిరది. అప్పట్లో ఆంధ్ర మహాసభలు నిర్వహించి నిర్బంధాలను దాటారు. ఇప్పుడు కొంతమంది తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారని’’ విచారం వ్యక్తం చేశారు.
ఈ మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించడంలో తెలుగువారి పాత్ర సన్నగిల్లుతోందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషను, ఉనికిని, మనుగడను, మన సంప్రదాయాన్ని కోల్పోకుండా కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. దేశంలోనే హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గింది. రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దు’’ అని రేవంత్ సూచించారు.
పరభాషా జ్ఞానం సంపాదించాలి కానీ మన భాషను గౌరవించాలి. తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో మేం ముందుకు వెళుతున్నాం. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలి’’ అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మహాసభల్లో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్దఎత్తున చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. సినీ నటులు, విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు సైతం హాజరయ్యారు. ఈ మహాసభల్లో సమాఖ్య అనుబంధ సంస్థల ప్రతినిధుల సమావేశం, వాణిజ్యం, పారిశ్రామికవేత్తల సదస్సులు నిర్వహిం చారు. 10 మందికి బిజినెస్ అచీవర్స్ పురస్కారాలు, కంపెనీల ద్వారా సేవా-దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్న వారికి సీఎస్‌ఆర్ పురస్కారాలు ఇచ్చారు. ఈసారి కొత్తగా తెలుగు ఏంజెల్స్ అనే కార్యక్రమంలో భాగంగా తెలుగువారి స్టార్టప్ కంపెనీలను సైతం పరిచయం చేశారు.
ముగింపు కార్యక్రమం….
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, సినీ రంగ ప్రముఖులు సాయికుమార్, మురళీమోహన్, జయసుధ, అశ్వనీదత్, జయప్రద, సమాఖ్య ప్రతినిధులు హాజరయ్యారు. సినీప్రముఖులను రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించి, మెమెంటోలు అందించారు. సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్, ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షురాలు కవితాదత్ పాల్గొన్నారు.
ముగింపు సభలో ‘తెలుగుదనం.. తెలుగుధనం.. పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సమాఖ్య రూపొందించిన ఈ పుస్తకాన్ని హైదరాబాద్ విభాగం ఛైర్‌పర్సన్ నార్నె విజయలక్ష్మి పరిచయం చేశారు. నిపుణులను సంప్రదించి వారి అభిప్రాయాలను పుస్తకంలో చేర్చామని.. తాళపత్ర గ్రంథాలు, పద్య రచనలు, భాష పరిచయం, వ్యాసాలు, ప్రముఖ చిత్రకారుల చిత్రాలు, పలు అంశాలు ఇందులో ఉంటాయన్నారు. ్ఞవారంలో 2 గంటలు విద్యార్థులకు నీతి కథలు, శతకాలు నేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నాం. విద్యార్థులకు ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించాల్ఠి అని కోరారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన రామోజీరావుతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ప్రజాకవి గద్దర్, శోభా నాయుడులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని ఆమె ప్రకటించారు. మారిషస్, మలేషియా, దక్షిణాఫ్రికా, నైజీరియా, బర్మాలో స్థిరపడిన తెలుగువారు హాజరయ్యారు. తెలుగులో మాట్లాడుతూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫిన్‌లాండ్ మహిళ ‘రైటా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వామన గుంటలు, అష్టాచెమ్మా, వైకుంఠపాళితోపాటు అనేక సంప్రదాయ ఆటలను ఈ మహాసభల్లో గుర్తు చేశారు.