KTR Arrest: గ్రీన్‌కో ఆఫీసుల్లో సోదాలు..! KTR అరెస్టుకు రంగం సిద్ధం..!?

ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) కు ఎదురుదెబ్బ తగిలింది. ఫార్ములా రేసు నిర్వహణలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ (ACB) తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ (Quash Petition) ను హైకోర్టు (High Court) కొట్టేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో కీలక భూమిక పోషించిన గ్రీన్ కో (Greenco) కంపెనీపై ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ నిర్వహించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రేసు నిర్వహణ నుంచి మధ్యవర్తిగా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ (Ace NextGen) సంస్థ వైదొలగడంతో ఫార్ములా ఈరేస్ ఆర్గనైజేషన్ కు HMDA రూ.41 కోట్ల రూపాయల నిధులను చెల్లించింది. అయితే ఇందుకు HMDA లేదా RBI అనుమతి తీసుకోలేదు. ఇది చట్టవిరుద్ధమని భావించిన ప్రస్తుత రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనిపై ఇటు ఏసీబీతో పాటు ఈడీ కూడా విచారణ చేపట్టింది. ఏసీబీ విచాణకు లాయర్లను అనుమతించకపోవడంతో కేటీఆర్ హాజరుకాకుండా వెనుదిరిగారు.
మరోవైపు ఈడీ ముందుకు కేటీఆర్ ఇవాళ హాజరు కావాల్సి ఉంది. అయితే తన క్వాష్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో తీర్పు ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని ఈడీకి మెయిల్ ద్వారా అభ్యర్థించారు. దీంతో ఈ నెల 16న విచారణకు రావాలని ఈడీ మరోసారి కేటీఆర్ కు నోటీసులు పంపించింది. అయితే క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు కేటీఆర్ సిద్ధమవుతున్నారు. దీంతో కేటీఆర్ పిటిషన్ పై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన కూడా వినాలంటూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇంతకాలం హైకోర్టు ఆదేశాలు ఉండడంతో కేటీఆర్ ను అరెస్టు చేయలేదు ఏసీబీ. అయితే ఇప్పుడు హైకోర్టు అలాంటి నిబంధనలను తొలగించడంతో కేటీఆర్ ను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా కేటీఆర్ ను చేయవచ్చని సమాచారం. దీంతో బీఆర్ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో నుంచి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయని వెలుగులోకి రావడం.. దాని అనుబంధ సంస్థ ఫార్ములా ఈ-రేస్ కోర్సు ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతే గ్రీన్ కో ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.