Etela Vs Congress: రచ్చ రాజేస్తున్న ఈటల కామెంట్స్.. ఫైర్ అవుతున్న కాంగ్రెస్ లీడర్స్

తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP Etela Rajendar).. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ మూడు రోజుల క్రితం చేసిన విమర్శలు కాంగ్రెస్ (Congress) నాయకులను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు, ఈటలపై ఘాటు విమర్శలు గుప్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైకో సీఎం (Psycho CM) అని సంబోధిస్తూ ఈటల రాజేందర్ చేసిన కామెంట్స్ రచ్చ రాజేస్తున్న్యి. సీఎం రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కావట్లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారని ఆయన ఆరోపించారు. నెలకు రూ.20వేల కోట్ల ఆదాయం వస్తున్నా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందన్నారు. కుల రాజకీయాలు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయని ఈటల విమర్శించారు. ప్రజలు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని కూడా ఆయన హెచ్చరించారు.
ఈటల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మర్యాదలు మరచి మాట్లాడొద్దు. రేవంత్‌పై దూషణలు మమ్మల్ని నొప్పించాయి. రోడ్డుపై బట్టలు విప్పి కొడతా’ అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jagga Reddy) ఘాటుగా హెచ్చరించారు. ఈటల వ్యాఖ్యలు ఆయన రాజకీయ అస్థిరతను బయటపెడుతున్నాయని, ఆయన మాటలు అనైతికమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. ఈటల రాజేందర్‌పై మరింత తీవ్రంగా స్పందించారు. “లెఫ్ట్ భావజాలం నుంచి రైట్ భావజాలానికి మారిన ఈటలకు చిప్ దొబ్బింది. భూ కుంభకోణం ఆరోపణల్లో ఉన్న నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు” అని ఆయన విమర్శించారు. విప్ ఆది శ్రీనివాస్ కూడా ఈటల వ్యాఖ్యలను ఖండించారు. “వ్యక్తిగత దూషణలు రాజకీయంగా అనైతికం. ఈటల రాజేందర్ తన మాటలను ఉపసంహరించుకోవాలి” అని డిమాండ్ చేశారు. టీపీసీసీ సభ్యుడు డాక్టర్ సత్యం శ్రీరంగం, “ఈటల రాజేందర్ మాటలు తెలంగాణ సమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి” అని అన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ “బీజేపీ అధ్యక్ష పదవి దక్కని అక్రోశంతో ఈటల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్‌పై దూషణలు కాంగ్రెస్ కార్యకర్తలు సహించరు” అని హెచ్చరించారు.
ఈటల రాజేందర్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రశ్నలు సంధించారు. “ప్రజల కష్టాలు తగ్గలేదు, రాష్ట్ర ఆదాయం తగ్గలేదు, అయినా ఖజానా ఖాళీ ఎందుకు? రాష్ట్ర పాలనలో అసమర్థత వల్లే ఈ పరిస్థితి వచ్చింది” అని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కుల రాజకీయాలు ప్రజల మధ్య చీలికలు తెస్తున్నాయని, ఇది రాష్ట్రానికి హానికరమని ఈటల పేర్కొన్నారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలను వ్యక్తిగత దూషణలుగా భావిస్తున్నారు. ఈటల మాత్రం రాష్ట్ర పాలనలో లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఈ వివాదం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.