Mahesh Goud: అలా చేసుంటే కేసీఆర్ కుటుంబం జైల్లో ఉండేది : మహేశ్ గౌడ్
కాంగ్రెస్ సర్కారు ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలకు పోదని, అలా చేసి ఉంటే కేసీఆర్, కేటీఆర్ (KCR), కవిత, హరీశ్‌రావులు ఈపాటికే జైల్లో ఉండి ఉండేవారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. గాంధీభవన్‌లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో బీజేపీ (BJP)కి దిమ్మ తిరిగిపోయిందని, దీంతో ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు గవర్నర్ అనుమతి వచ్చేసిందని చెప్పారు. గవర్నర్ అనుమతించేందుకు 6 నెలల సమయం ఎందుకు పట్టిందన్నది కేంద్ర మంత్రులు, కిషన్‌రెడ్డి (Kishan Reddy) , బండి సంజయ్‌లే( Bandi Sanjay) చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌ల మధ్య చీకటి ఒప్పందాలే ఉంటే ఆరు నెలల కిందటే కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలుకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చి ఉండేది కదా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్‌పై చట్ట ప్రకారమే విచారణ జరుగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినంత మాత్రాన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పోరాటం ముగిసినట్లు కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంద ని చెప్పారు.






