కాంగ్రెస్ కదనోత్సాహం.. బీఆర్ఎస్ ఢీలా..

పదేళ్లపాటు తెలంగాణను ఏలిన బీఆర్ఎస్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఓవైపు కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను.. చాపకింద నీరులా పార్టీలో చేర్చుకుంటోంది. గట్టిగా విమర్శిద్దామా అంటే.. గతంలో తాము ఇలానే చేసి ఉండడంతో కుదరడం లేదు. పోనీ ఉండండిరా బాబూ అంటే వారేమో.. అధికార పార్టీ పిలుస్తోందంటూ జారిపోతున్నారు. దీంతో ఎక్కడ గులాబీ పార్టీ ఎక్కడ ఖాళీ అయిపోతుందో అన్న భయం కేసీఆర్ టీమ్ లో కనిపిస్తోంది. ఓవైపు రాజకీయంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్.. ఇప్పుడు తనదైన విధానాలతో ముందుకు దూసుకెళ్తోంది.
ముఖ్యంగా రైతు రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ దూకుడు మీదుంది. ఈ రుణమాఫీ విషయంలో గతంలో బీఆర్ఎస్ చాలా విమర్శలు చేసింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ చేసి చూపిస్తుండడంతో ఏం చేయాలో తోచడం లేదు. మరీ ముఖ్యంగా త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. వాటిపై రుణమాఫీ కచ్చితంగా ప్రభావం చూపించే పరిస్థితి. అందుకే కక్కలేక, మింగలేక అన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ నేతల పరిస్థితి. ఓవైపు ఎన్నికల హామీలను అమలు చేసుకుంటూ.. మరోవైపు బీఆర్ఎస్ నేతలను కలుపుకుంటూ కాంగ్రెస్ ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పుడు తమ లీడర్లను లాగేసుకుంటున్నారని బీఆ్గర్ఎస్ నేతల గోలపెడుతుంటే.. మరి గతంలో మీరేం చేశారంటూ సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
రాజకీయంగా స్పీకర్ తమ మాట వినే పరిస్థితి లేదు. కోర్టుకు వెళ్దామంటే.. కోర్టులో కూడా స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వ్యవస్థలు.. ఒక్కదాన్ని మరొకటి కార్నర్ చేయవు కాబట్టి. ఈ ఐదేళ్లపాటు పార్టీని బతికించుకుంటూ ముందుకు సాగడం ఎలా అన్నదే ఆపార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఉన్ననేతలు పార్టీకి భవిష్యత్ లేదని తీర్మానించి, మరీ గట్టుదాటుతున్నారు. వీరందరికీ పొరుగున ఉన్న టీడీపీ ప్రస్థానాన్ని చూపించి, ఆపేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే మనకూ మంచి రోజులు వస్తాయి. మళ్లీ మనదే అధికారమని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నాా నేతలు నమ్మని పరిస్థితి. దీంతో ఉద్యమపార్టీ భవిష్యత్ ఎలా ఉండనుందో అన్న భయం… ఆపార్టీ అభిమానుల్లో కనిపిస్తోంది.