Revanth Reddy: రేవంత్ రెడ్డి పాలనపై హైకమాండ్ సమీక్ష..! మార్పులు ఖాయమా..?

తెలంగాణలో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయింది. ఎవరి పాలననైనా అంచనా వేసేందుకు ఏడాది కాలం సరిపోతుంది. ఈ ఏడాదిలో తాము ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని.. గ్యారంటీలను దాదాపు పూర్తి చేశామని చెప్పుకుంటోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓ వైపు ఆర్థిక భారమున్నా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదని చెప్తోంది. అయితే రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది.. ప్రజలు ఏమనుకుంటున్నారు.. లాంటి అనేక అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి పాలనపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తోంది.
దాదాపు 140 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఢిల్లీలో సొంతంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ కార్యాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల కీలక నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గ సహచరులు కూడా ఢిల్లీ వెళ్లారు. ఎవరెవరు రావాలో ముందే హైకమాండ్ ఆదేశించి ఉండడంతో వాళ్లంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తెలంగాణ నేతలతో కేసీ వేణుగోపాల్ (KC Venu Gopal) తన నివాసంతో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
ఇటీవలే తెలంగాణలో (Telangana) పర్యటించారు కేసీ వేణుగోపాల్. ఈ సందర్భంగా ఆయన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భారమంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నెట్టేసి మంత్రులు (Telangana Ministers) తప్పించుకుంటున్నారని విమర్శించారు. ఏ అంశాన్నయినా సమష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ఇప్పుడు ఇవే అంశాలను మరోసారి మంత్రులకు చెప్పినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్.. తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహా మంత్రులందరితో కేసీ వేణుగోపాల్ విడివిడిగా సమావేశమై వాళ్ల అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీని ఏకతాటిపై నడిపించాలని.. వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడుచుకోరాదని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన కూడా కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణకు అంగీకరించాలని సీఎం కోరగా.. రాహుల్, సోనియా, ఖర్గేలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెప్తానని కేసీ వేణుగోపాల్ అన్నట్టు సమాచారం. ఈ నెలలోపే సంస్థాగత నిర్మాణంతో పాటు మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే దిశగా హైకమాండ్ అడుగులు వేస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి.