భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక పథకం ప్రారంభం

భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బడుగువర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని, వీటి పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని, పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేని శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.