Chandrababu: చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన బీజేపీ..!?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అనుసరించాలనుకున్న వ్యూహం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందనే సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ (BJP) అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించి, తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని, నిర్ణయాత్మక శక్తిని చాటుకోవాలని టీడీపీ భావించింది. అయితే, ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ మద్దతును తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubilee Hills Byelection) తటస్థ వైఖరి అవలంబించాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా బీజేపీ నిరాకరించిందని సమాచారం. ఇందుకు అనేక కారణాలను బీజేపీ వెల్లడించినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణలో చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత వల్లే టీడీపీ మద్దతు తీసుకోకూడదని బీజేపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని ప్రధాన వర్గాల్లో చంద్రబాబుపై బలమైన వ్యతిరేకత ఉన్నట్లు బీజేపీ నాయకత్వం గుర్తించింది. ఈ సమయంలో టీడీపీ మద్దతు తీసుకుంటే, అది ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థికి నష్టం చేకూరుస్తుందని, ఓటర్లు దూరం జరిగే అవకాశం ఉంటుందని బీజేపీ భావించింది. అందుకే టీడీపీ మద్దతు తమకు అక్కర్లేదని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇతరుల మద్దతుపై ఆధారపడకుండా, సొంత బలంతోనే విజయం సాధించాలనే సంకేతాన్ని బీజేపీ ఇవ్వదలుచుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో టీడీపీ నాయకత్వం డీలా పడినట్లు సమాచారం. అలాగని ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం లేదు. మంగళవారం ఉండవల్లిలో టీటీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం సందర్భంగా ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ మద్దతు కోరితే ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని, లేకుంటే తటస్థంగా ఉండాలని పార్టీ కేడర్ కు ఆయన సూచించారు. అలాగే, ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న బీఆర్‌ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణలో కూడా ప్రభావం చూపించాలని టీడీపీ భావించింది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని సీట్లయినా గెలుచుకోవడం ద్వారా ప్రభావం చూపించాలనని చంద్రబాబు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. కానీ, బీజేపీ తమ మద్దతును తిరస్కరించడంతో ఆయన వ్యూహం బెడిసికొట్టినట్లయింది.