WTF: ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభం.. ముఖ్య అతిధిగా వచ్చిన చంద్రబాబు

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ(HICC) వేదికగా ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ చేతుల మీదుగా తొలిసారి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు.. శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే.. అదే తెలుగుజాతి. తెలంగాణ, ఏపీ, ఆస్ట్రేలియా, అమెరికా.. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడకు వచ్చారు. వివిధ దేశాల సమాఖ్యల అధ్యక్షుడు ఇక్కడకు వచ్చారు. నా జీవితంలో ఇది ఎంతో సంతోషకరమైన రోజు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం. తెలుగు భాష, సంప్రదాయాలు, సంస్కృతిపై ఇష్టం, గౌరవంతో ప్రపంచ నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చారు. నిజం చెప్పాలంటే.. ఏపీ, తెలంగాణలో ఉండే తెలుగువారికంటే భాష, సంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే’’ అని చంద్రబాబు అన్నారు.
అలాగే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని, ఏఐ, డీప్ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలన్నారు. తెలుగువారి ఐక్యతే ప్రధాన లక్ష్యంగా మహాసభలను నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్ తెలిపారు. 5వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి హాజరు అవుతారని చెప్పారు.