Cabinet Expansion : రేవంత్ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఈ నెలలోనే ముహూర్తం..!?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అయినా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తన కేబినెట్ (Cabinet) ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసుకోలేదు. ఇప్పటికీ ఆరు స్థానాలు మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని ప్రయత్నించినా వివిధ కారణాల వల్ల కుదరలేదు. మంత్రివర్గ విస్తరణకోసం (Cabinet Expansion) సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ హైకమాండ్ అనుమతి కోరారు. అయితే వివిధ రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా వాళ్లు మంత్రివర్గ విస్తరణపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఎన్నికల హడావుడి ముగియడంతో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ నెలలోనే మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్టు గాంధీ భవన్ వర్గాల టాక్.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 12 మందిని తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఇంకా ఆరుగురిని నియమించుకునే వీలుంది. ఈ ఆరు స్థానాలకోసం ఆశావహులు భారీగా ఉన్నారు. అంతేకాక ఇప్పటికీ కొన్ని జిల్లాలకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఒక్కరు కూడా మంత్రిగా లేరు. దీంతో ఈసారి విస్తరణలో ఈ జిల్లాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. అలాగే మైనారిటీ కోటాలో ఒకరికి అవకాశం లభించనుంది. ముదిరాజ్, వెలమ సామాజిక వర్గాలకు చెందిన వారికి కూడా ఈసారి స్థానం దక్కుతుందని భావిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. దీంతో ఇక్కడ ఎవరికీ ఛాన్స్ రాలేదు. అయితే దానం నాగేందర్ (Danam Nagendar) లాంటి వాళ్లు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే అనర్హత కేసు పెండింగ్ లో ఉన్నందున ఆయనకు మంత్రిపదవి వచ్చే ఛాన్స్ లేదు. తనకు హైదరాబాద్ మరియు వెలమ కోటాలో అవకాశం ఇవ్వాలని మైనంపల్లి రోహిత్ (Mynampalli Rohith) కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy), పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (Rammohan Reddy) చోటు ఆశిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి (Sudarshan Reddy) తప్పకుండా చోటు దక్కే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి (Vivek Venkata Swamy), ప్రేమ్ సాగర్ రావుల్లో (Prem Sagar Rao) ఒకరికి తప్పకుండా కేబినెట్లో స్థానం లభించవచ్చు. ఇక నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy), బాలు నాయక్ (Balu Naik) ఆశిస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా కూడా కొంతమంది పదవులు ఆశిస్తున్నారు. మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీకి (Shabbir Ali) మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే సీనియర్ నేత కోదండరామ్ (Kodandaram) కు కూడా ఛాన్స్ దక్కొచ్చని భావిస్తున్నారు. బీసీ కోటాలో సీఎం సొంత జిల్లాకు చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్ (Vakiti Srihari Mudiraj) కు పక్కాగా చోటు దక్కుతుందని చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం ప్రస్తుతం ఖాళీగా ఉన్న హోం, విద్య, మున్సిపల్ శాఖలను కొత్తవారికి అప్పగించే అవకాశం ఉంది.