బీజేపీలో విలీనానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందా..??

తెలంగాణలో దాదాపు పాతికేళ్లపాటు చక్రం తిప్పింతి భారత్ రాష్ట్ర సమితి – బీఆర్ఎస్. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దీంతో పార్టీ పూర్తి నిరాశలో కూరుకుపోయింది. మరోవైపు కేసులు ఆ పార్టీ కీలక నేతలను వెంటాడుతున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలనేదానిపై ఆ పార్టీలో అంతర్మథనం సాగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో కలిసి పనిచేయడం ఒక్కటే మార్గమని కొంతమంది నేతలు కేసీఆర్ కు సూచించినట్లు సమాచారం. అయితే బీజేపీ ఆలోచన మరోలా ఉన్నట్టు తెలుస్తోంది.
14 ఏళ్లపాటు ఉద్యమం, 10 ఏళ్లపాటు అధికారం బీఆర్ఎస్ కు పెద్దగా కష్టం కలిగించలేదు. ఆ పార్టీ చెప్పిందే వేదం అన్నట్టు సాగింది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా ఆ పార్టీ ఓడిపోయే సరికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ల అవకతవకలను వెలికితీసి కేసులు పెడుతోంది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, లిక్కర్ స్కాం, తదితరాల్లో బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ ఈ కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైల్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పార్టీలో భయాందోళనలు నెలకొన్నాయి.
పార్టీ హైకమాండ్ బలంగా ఉన్నప్పుడే కేడర్ లో నమ్మకం ఉంటుంది. అధినాయకత్వమే చేతులెత్తేసినప్పుడు కేడర్ అస్సలు ఉండదు. చిలువలుపలువలుగా మారిపోతుంది. అధికారంలో లేకపోవడంతో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు పార్టీ మారిపోతున్నారు. మరికొందరు కూడా వెళ్తారని టాక్ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ను వీక్ చేసి లబ్ది పొందేందుకు కాంగ్రెస్, బీజేపీ కాచుకు కూర్చుకున్నాయి. ఇప్పుడు పార్టీ బతికి బట్టకట్టాలంటే జాతీయ పార్టీల మద్దతు తప్పనిసరి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో ఆ పార్టీతో కలిసి పనిచేసే అవకాశం లేదు. దీంతో మిగిలింది బీజేపీ మాత్రమే. ఇప్పుడు బీఆర్ఎస్ కు ఎంపీలు లేరు. కాబట్టి బీజేపీకి బీఆర్ఎస్ అవసరం లేదు. దీంతో బీజేపీ దేకట్లేదు.
అయినా బీఆర్ఎస్ మాత్రం బీజేపీతో సఖ్యతకోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కేసుల నుంచి బయటపడేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే మాకేంటి అనే ధోరణిలో బీజేపీ వ్యవహరిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీని విలీనం చేస్తే పరిశీలిస్తామని సూచించినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ విలీనానికి కేసీఆర్ సుముఖంగా లేరని వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ బీజేపీలో కొందరు కీలక నేతలు కూడా విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. మొత్తానికి బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దాగుడుమూతల వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తోంది.