BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభ… పూర్వ వైభవం సాధ్యమేనా..?

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) గా ఆవిర్భవించి, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (BRS)గా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది ఆ పార్టీ. ఈ సందర్భంగా రేపు వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో (Elkaturthi) రజతోత్సవ సభను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సభ ద్వారా పార్టీ తన పూర్వ వైభవాన్ని సాధించగలదా అనే ప్రశ్న తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
2001లో కె.చంద్రశేఖర్ రావు (KCR) నాయకత్వంలో టీఆర్ఎస్ స్థాపించినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సాధన దాని ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ (Telangana) ప్రాంతం ఎదుర్కొన్న దశాబ్దాల అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా ఉద్యమపార్టీగా అది మొదలైంది. కేసీఆర్ దీక్షలు, ఉద్యమ స్ఫూర్తి, ప్రజలతో నేరుగా అనుసంధానం కావడంతో తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాకు ప్రత్యేక చోటు కల్పించాయి. 2009లో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలకమైన మలుపుగా నిలిచింది. ఫలితంగా, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.
2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ తెలంగాణలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వంటి పథకాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయి. ఈ పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ తెలంగాణ గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
అయితే, 2023 శాసనసభ ఎన్నికలలో (Assembly Elections) బీఆర్ఎస్ ఊహించని ఓటమిని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పాలనపై అవినీతి, కుటుంబ పాలన ఆరోపణలతో ప్రజలను ఆకర్షించింది. బీఆర్ఎస్ ఆధిపత్యం, కొంతమంది నాయకుల అహంకారం, ప్రజల నుంచి దూరమవడం వంటి అంశాలు ఓటమికి కారణాలుగా భావించవచ్చు. ఈ ఓటమి తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం పార్టీకి మరో దెబ్బగా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతిన్నది. లోక్ సభ ఎన్నికలలో పార్టీ ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ తప్పిదాలను ఎత్తిచూపుతూ వాళ్లను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.
వరంగల్ లోని ఎల్కతుర్తిలో జరిగే ఈ రజతోత్సవ సభ బీఆర్ఎస్ కు ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. 1,300 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానులు హాజరవుతారని అంచనా. 2,000 మంది వాలంటీర్లు, 250 సీసీటీవీ కెమెరాలు, 200 మొబైల్ పెట్రోల్ వాహనాలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రత్యేక వేదిక వంటి భారీ ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ సభలో కేసీఆర్ తన ఉపన్యాసంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, బీజేపీ రాజకీయ వ్యూహాలను లక్ష్యంగా చేసుకుని విమర్శించే అవకాశం ఉంది. అలాగే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కార్యకర్తలను సన్నద్ధం చేయడం, పార్టీ సభ్యత్వ నమోదు, అంతర్గత ఎన్నికల ప్రక్రియను ప్రకటించే అవకాశం ఉంది.
ఈ సభ బీఆర్ఎస్ కు మనోధైర్యాన్ని పెంచే అవకాశం కల్పించినప్పటికీ, పూర్వ వైభవాన్ని సాధించడం అంత సులువు కాదు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వంటి వ్యూహాలు, బీజేపీకి పెరుగుతున్న అభిమానం, పార్టీ అంతర్గత సమస్యలు బీఆర్ఎస్ ముందున్న అతి పెద్ద సవాళ్లు. అయితే, తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ భావోద్వేగ సంబంధం, కేసీఆర్ రాజకీయ తెలివి, కార్యకర్తల ఉత్సాహం పార్టీకి బలం. వీటిని సక్రమంగా వినియోగించుకోలగితే బీఆర్ఎస్ కు మళ్లీ పూర్వ వైభవం సాధ్యమే..!