Karachi Bakery: కరాచీ బేకరీపై ఎందుకీ ద్వేషం..?

భారత్-పాకిస్తాన్ (India – Pakistan) మధ్య సైనిక ఉద్రిక్తతలు కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కావట్లేదు. దేశంలోని సామాజిక సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంతో (Visakhapatnam) పాటు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ కరాచీ బేకరీ (Karachi Bakery) శాఖలపై కొందరు హిందువులు దాడులు చేశారు. కేవలం బేకరీకి పాకిస్తాన్ (Pakistan) నగరమైన కరాచీ పేరు పెట్టుకోవడం వల్లే ఈ దాడులు జరిగాయి. అయితే ఈ బేకరీని నడిపే వారు హిందూ వలసదారులేనని సమాచారం. ఈ సంఘటనలు దేశంలో హిందూ-ముస్లిం మధ్య మత ఘర్షణలను మరింత పెంచుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కరాచీ బేకరీ 1953లో ఖాన్‌చంద్ రామ్నాని (Khan Chand Ramnani) అనే సింధీ హిందూ వలసదారుడు హైదరాబాద్‌లో స్థాపించారు. 1947లో భారత విభజన సమయంలో పాకిస్తాన్‌లోని కరాచీ నుంచి భారత్‌కు వలస వచ్చిన రామ్నాని, తన స్వస్థలం పట్ల గౌరవంగా ఈ బేకరీకి “కరాచీ” అనే పేరు పెట్టారు. ఈ బేకరీ ఫ్రూట్ బిస్కెట్లు, దిల్‌కుష్, ప్లమ్ కేక్‌లతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ బేకరీ హిందువులు నడుపుతున్నప్పటికీ, దాని పేరు కారణంగా గతంలోనూ పలుమార్లు దాడులు జరిగాయి. 2019లో పుల్వామా (Pulwama) దాడి తర్వాత, 2021లో ముంబైలో (Mumbai) దాడుల తర్వాత కరాచీ బేకరీలపై దాడులు చేశారు. తాజాగా పహల్గాం (Pahalgam) దాడుల తర్వాత కూడా ఈ బేకరీపై మళ్లీ దాడులు జరిగాయి.
విశాఖపట్నంలో జన జాగరణ సమితి (Jana Jagarana Samithi) నాయకత్వంలో జరిగిన దాడిలో ఉగ్రవాదులు బేకరీ సైన్‌బోర్డును ధ్వంసం చేశారు. కరాచీ పేరు తొలగించాలి అని నినాదాలు చేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో బీజేపీ నాయకులు బేకరీని ధ్వంసం చేశారు. ఈ దాడులు దేశంలోని మతపరమైన ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసేలా ఉన్నాయి. బేకరీ యజమానులు తాము భారతీయులమని, దేశంలో పలు శాఖలు నడుపుతున్నామని వివరించినప్పటికీ ఈ దాడులు ఆగట్లేదు. ఈ దాడులు దేశానికి చెడ్డపేరు తెస్తున్నాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొందరి మూర్ఖత్వం దేశ సమగ్రతకు హాని కలిగిస్తోంది. ఇలాంటి చర్యలు భారతదేశ బహుసాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీస్తాయి అని కొందరు చెప్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి దాడులను నియంత్రించాలని కోరుతున్నారు.
కరాచీ బేకరీ దాడులు కేవలం ఒక సంస్థపై జరిగిన దాడి కాదుని.. దేశంలోని సామాజిక సమతుల్యతను ప్రశ్నార్థకం చేసే సంఘటనలని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి, సమాజంలో అవగాహన పెంచడానికి, రాజకీయ లబ్ధి కోసం మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలను అరికట్టడానికి తక్షణ చర్యలు అవసరమని సూచిస్తున్నారు.