White House :శ్వేతసౌధంపై దాడి కేసు.. తెలుగు యువకుడికి ఎనిమిదేళ్ల జైలు

అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం (White House ) పై ట్రక్కుతో దాడి చేసిన కేసులో తెలుగు సంతతి యువకుడు కందుల సాయివర్షిత్ (Saivarshit ) (20)కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడిరది. 2023 మే 22న జరిగిన ఘటనపై స్థానిక కోర్టు తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌లోని చందానగర్‌లో జన్మించిన సాయివర్షిత్ అమెరికా గ్రీన్‌కార్డు (Green card )కలిగి ఉన్నాడు. ఆ యువకుడు 2023 మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్ లూయి నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి 9:35 గంటల ప్రాంతంలో శ్వేతసౌధం వద్దకు చేరుకుని అక్కడి బారికేడ్లను ఢీకొట్టాడు. అనంతరం సాయివర్షిత్ తన బ్యాగులో నుంచి తెలుపు, ఎరుపు రంగులతో కూడిన నాజీల స్వస్తిక్ గుర్తు జెండాను ప్రదర్శించాడు. ఘటనా స్థలంలోనే పోలీసులు (Police) అతణ్ని నిర్బంధించారు. అధ్యక్షుడు బైడెన్‌ను హత్య చేయాలనే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగానే సాయి వర్షిత్ ఈ దాడికి యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిందితుడు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. తాజాగా జిల్లా కోర్టు జడ్జి నిందితుడికి జైలు శిక్ష విధించారు. విడుదలైన అనంతరం మరో మూడేళ్లు పర్యవేక్షించాలని ఆదేశించారు.