Telangana Congress: ఇంత చేస్తున్నా చెడ్డ పేరెందుకు? తెలంగాణ కాంగ్రెస్ అంతర్మథనం..!!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన పార్టీ కాంగ్రెస్. అయినా ఆ పార్టీ తెలంగాణలో (Telangana) అదికారంలోకి రావడానికి పదేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకుంది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది పదవీకాలాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది కాలంలో తాము ఎంతో చేశామని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ (Congress Party). బీఆర్ఎస్ (BRS) పదేళ్ల పాలనలో అస్తవ్యస్తంగా మారిన తెలంగాణ రాష్ట్రాన్ని తాము గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు (Congress Leaders) చెప్తున్నారు. అయితే తాము చేసిన పనులను ప్రజలకు చెప్పకోవడంలో విఫలమవుతున్నట్టు భావిస్తున్నారు.
2023 డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలను (Six guarantees) ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మి (Mahalakshmi) పథకం ద్వారా ఉచిత బస్సు రవాణా, రూ.500కే గ్యాస్ సిలండర్, నెలకు రూ.2500 ఇస్తామని ప్రకటించింది. ఇందులో నగదు బదిలీ తప్ప మిగిలిన రెండింటినీ అమలు చేస్తోంది. ఇక రెండో హామీ రైతు భరోసా (Rythu Bharosa) ద్వారా రైతులకు ఏటా రూ.15వేల ఆర్థిక సాయం, కూలీలకు రూ.12వేలు ఇస్తామని తెలిపింది. దీన్ని సంక్రాంతి తర్వాత అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. మూడో హామీ గృహజ్యోతి (Gruhajyothi) ద్వారా నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపింది. దీన్ని కూడా అమలు చేస్తోంది.
నాలుగో హామీ ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Indlu). ఈ హామీని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఐదో హామీ యువ వికాసం (Yuva vikasam) ద్వారా పేద విద్యార్థులకు రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. దీన్ని ప్రారంభించింది. ప్రతి రెవిన్యూ బ్లాక్ లో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభిస్తామని తెలిపింది. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. ఆరో హామీ చేయూత (Cheyutha). దీని ద్వారా నిరుపేదలకు రూ.4వేల పెన్షన్ అందిస్తామని తెలిపింది. దీన్ని అమలు చేస్తోంది. అన్నిటికీ మించి ఒకేసారి రూ.18వేల కోట్ల రుణ మాఫీ చేసింది. ఇలా దాదాపు తాము చెప్పిన గ్యారంటీలన్నింటినీ అమలు చేసి చూపిస్తున్నామని.. ఈ ఏడాదిలో రూ.50వేల కోట్ల రూపాయల లబ్ది చేకూర్చామని ఆ పార్టీ నేతలు వివరిస్తున్నారు.
అయితే తాము చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమవుతున్నామనే భావన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. విపక్షాల ఆరోపణలే ఎక్కువగా జనంలోకి వెళ్తున్నాయని.. వాళ్ల ఆరోపణలను తిప్పికొట్టలేకపోతున్నామని భావిస్తోంది. అందుకే 8న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమవుతోంది. PAC సభ్యులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, సీనియర్ నేతలు ప్రభుత్వ కార్యక్రమాలను వివరించనున్నారు. తద్వారా క్షేత్రస్థాయికి పార్టీని తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పనులను వివరించడం, విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంపై యాక్షన్ ప్లాన్ రెడీ చేయబోతున్నారు.